త్వరలో కొత్త ట్రస్ట్‌ బోర్డు! | - | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త ట్రస్ట్‌ బోర్డు!

Jul 23 2025 12:27 PM | Updated on Jul 23 2025 12:27 PM

త్వరలో కొత్త ట్రస్ట్‌ బోర్డు!

త్వరలో కొత్త ట్రస్ట్‌ బోర్డు!

ఈ నియోజకవర్గాల నుంచే..

ఫ అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే 25 పేర్లు సిఫారసు చేసినట్లు సమాచారం.

ఫ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, కాకినాడ రూరల్‌ నుంచి ఆ పార్టీ తరఫున ఒక్కొక్కరిని ట్రస్ట్‌ బోర్డులో నియమించనున్నారు.

ఫ అలాగే, బీజేపీ తరఫున రాజమహేంద్రవరం, ప్రత్తిపాడు నుంచి ఒకొక్కరిని మాత్రమే ట్రస్ట్‌ బోర్డులో నియమించనున్నారు.

ఫ మిగిలిన 13 మందినీ టీడీపీ నుంచే ఎంపిక చేస్తారని సమాచారం.

ఫ పెద్దాపురం నుంచి శ్రీ లలితా ఇండస్ట్రీ అధినేత మట్టే సత్యప్రసాద్‌ను రెండోసారి కూడా దాత కోటాలో టీడీపీ ప్రజాప్రతినిధి సిఫారసు చేసినట్లు సమాచారం. గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనను దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యునిగా నియమించారు. ఆ తరువాత సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సత్యప్రసాద్‌ దంపతులు రూ. 2.5 కోట్లతో వజ్ర కిరీటాలు చేయించారు. ఇటీవల అమ్మవారికి రూ.20 లక్షల విలువైన వజ్రాల హారాన్ని ఆయన కుమారుడు మట్టే ఆదిశంకర్‌ దంపతులు సమర్పించారు. వీటితో పాటు రూ.5 కోట్ల వ్యయంతో సత్యదేవుని ప్రసాద తయారీ భవనం, మరో రూ.2 కోట్ల విలువైన పూజాసామగ్రి సమర్పించారు. పలు భవనాలు కూడా నిర్మించారు.

ఫ తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ సిటీ, పాయకరావుపేట ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి ధర్మకర్తల మండలిలో చోటు దక్కే అవకాశం ఉంది.

ఫ కోనసీమ నుంచి ఒకరు, మిగిలిన ఇద్దరూ గుంటూరు, విశాఖకు చెందిన వారు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఫ టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు అధికమైతే మాత్రం జనసేన, బీజేపీల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే చాన్స్‌ ఇస్తారు. టీడీపీ నుంచి మరో ఇద్దరిని నియమిస్తారు.

ఫ అన్నవరం దేవస్థానానికి నెలాఖరులోగా

నియమించనున్న సర్కారు

ఫ 25 మంది పేర్లతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలు

ఫ కొత్త ధర్మకర్తల మండలి చైర్మన్‌గా ఐవీ రోహిత్‌.. మరో 17 మంది సభ్యులు

ఫ 13 పదవులు టీడీపీకే..

ఫ జనసేన, బీజేపీకి చెరో

రెండింటితో సరిపెట్టాలని యోచన

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నూతన ధర్మకర్తల మండలి(ట్రస్ట్‌ బోర్డు)ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2023లో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ బోర్డు కాలపరిమితి గత ఫిబ్రవరి 8న ముగిసింది. అప్పటి నుంచీ దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, ఆలయ చైర్మన్‌ ఐవీ రోహిత్‌ ట్రస్ట్‌ బోర్డు తరఫున అధికారులతో సమావేశమై తీర్మానాలు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ మాసంలోనే ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగేలా ఏర్పాటు చేయనున్నారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఈ నెల 19వ తేదీకల్లా ధర్మకర్తల మండళ్లను ఏర్పాటు చేయాలని, అందుకు పేర్లు పంపించాలని ఆయా ఆలయాల పరిధిలోని ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఇప్పటికే కోరింది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశావహుల పేర్లను ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వ వడపోత ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా కొత్త ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

గతంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2023లో 16 మందితో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ బోర్డులో అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 15 మంది సభ్యుల్లో ఏడుగురు మహిళలు కాగా, మిగిలిన ఎనిమిది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారే కావడం విశేషం. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్‌ బోర్డులో స్థానం కల్పించారు. అన్ని వర్గాలకూ ప్రాధాన్యం కల్పించినదిగా ఈ ట్రస్ట్‌ బోర్డు దేవస్థానం చరిత్రలో నిలిచిపోయింది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధమైన ఫార్ములాతో ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త ట్రస్ట్‌ బోర్డులో చైర్మన్‌తో పాటు మరో 17 మంది సభ్యులుంటారని తెలుస్తోంది. దేవదాయ శాఖ చట్టం ప్రకారం నూతన ట్రస్ట్‌ బోర్డుకు కూడా దేవస్థానం వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఐవీ రోహిత్‌ చైర్మన్‌గా నియమితులవ్వనున్నారు. మొత్తం సభ్యుల్లో నలుగురు లేదా ఐదుగురు మాత్రమే మహిళలుంటారని చెబుతున్నారు. అన్ని సామాజికవర్గాలతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కూడా ట్రస్ట్‌ బోర్డులో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. నాయీబ్రాహ్మణ వర్గాల నుంచి కూడా ఒకరిని నియమించనున్నారు. అలాగే, దేవస్థానం తరఫున ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు.

జనసేన ‘పంచాయితీ’

ట్రస్ట్‌ బోర్డు నియామకంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి సోషల్‌ మీడియాలో జనసేన తరఫున పిఠాపురం రూరల్‌ మండలానికి చెందిన ఒక వ్యక్తి పేరు ప్రతిపాదించారు. అతడు సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌ సీపీతో పాటు అక్కడి టీడీపీ, జనసేనలోని ఒక వర్గం నాయకుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నియోజకవర్గ నాయకునితో పాటు జనసేనలోని కొంత మంది కూడా అతడిని హెచ్చరించారు. అయినా అతడి తీరు మారలేదని సమాచారం. ఇప్పుడు ధర్మకర్త మండలికి అతడి పేరు ఏవిధంగా సిఫారసు చేస్తారని జనసేనలోని మరో వర్గం సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. కాగా, టీడీపీ నుంచి కూడా ట్రస్ట్‌ బోర్డులో ఒకరిని నియమించాలని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయక ులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు లేఖలు రాసినట్లు చెబుతున్నారు. ట్రస్ట్‌ బోర్డు సభ్యుల పేర్లు బయటకు వస్తే మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా ఇటువంటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

అన్నవరం దేవస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement