
మిథున్‌రెడ్డి అరెస్టు దుర్మార్గం
● తప్పుడు కేసులలో అక్రమంగా ఇరికించారు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
తుని రూరల్: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని తప్పుడు కేసులలో ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని శివారు గెడ్లబీడు సాయి వేదికలో సోమవారం జరిగిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికై న మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వమే నేరుగా దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తే రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల ఆదాయం సమకూరిందని, కానీ, అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని చెప్పారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోను, జగన్ ప్రభుత్వంలోను ఆదాయాలు ఎంత వచ్చాయో లెక్కలు చూడకుండానే కేసులు పెట్టాలనే లక్ష్యంతోనే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా మిథున్‌రెడ్డిపై బురద జల్లుతున్నారన్నారు. పచ్చ మీడియా బురద జల్లుతూ కథనాలు ప్రచరిస్తోందని, ఆ మీడియాలో ఉన్న వారు కాలకేయులు, అనకొండల మాదిరిగా విషం చిమ్ముతూ శకుని పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులను ఎవరిని అరెస్టు చేసినా అంతకు ముందు పచ్చ మీడియాలో తప్పుడు కథనాలు, ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో విక్రయించిన బ్రాండ్లనే చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలలు అమ్మిందన్నారు. మద్యం అక్రమాల ద్వారా జగన్ రూ.3,300 కోట్లు సంపాదించారని తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిని రికవరీ చేయాలనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దీనికోసం కొత్త చట్టాలు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు చంద్రబాబు, యనమల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులెంత, ఇప్పుడెంత ఉన్నాయో వెల్లడించాలని, తాను కూడా దీనికి సిద్ధమని, అదనపు ఆస్తులను ప్రజలకు పంచేద్దామా అని రాజా సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడే స్వయంగా రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నట్టు ప్రకటించారన్నారు. రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు రూ.లక్ష కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆ ఆస్తి రికవరీ చేద్దామని అన్నారు. బురద జల్లేసి మీరే కడుక్కోండని అంటున్నారన్నారు. కలసి చదువుకుంటున్న సమయంలో పెద్దిరెడ్డి ఏదో అన్నారని ఇప్పుడు ఆయన కొడుకుపై చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారన్నారు. మిథున్‌రెడ్డిని పరామర్శించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి రాజమహేంద్రవరం వస్తే పిలవకుండానే లక్షలాదిగా ప్రజలందరూ మద్దతు ఇస్తారని చెప్పారు. ఆ ప్రభంజనాన్ని అడ్డుకోగలరా అని ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వస్తున్నారని అనడం సిగ్గుమాలిన ప్రేలాపనని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ, నాయకులు ఏకమైనా అడ్డుకోలేమన్న విషయం చంద్రబాబుకు అర్థమైందని, వచ్చే మూడేళ్లలో లోకేష్ సీఎం కాకపోతే జీవితంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. వర్షం వస్తే రాజధాని మునిగిపోతోందని, అమరావతి ఎత్తిపోతల పథకంలా మారిందని విమర్శించారు. టీడీపీ సభలకు జనం వస్తే తమ్ముళ్లు వచ్చారని, వైఎస్సార్ సీపీకి వస్తే అల్లరి మూక వచ్చిందని పచ్చ మీడియా రాస్తోందన్నారు. వారి తప్పుడు కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పవన్ కల్యాణ్ సాక్షిగా ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ ప్రతిపక్షాన్ని కాకుండా 143 హామీలు అమలుపై చంద్రబాబును ప్రశ్నించాలని రాజా హితవు పలికారు.