
శాకంబరిగా పురుహూతికా అమ్మవారు
పిఠాపురం: బిడ్డల ఆకలి తీర్చే కన్నతల్లిలా.. ఈ సమస్త జగత్తు ఆకలినీ తీర్చే ఆ జగజ్జనని శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠాల్లో పదోది అయిన పిఠాపురం పాదగయ క్షేత్రంలో వెలసిన పురుహూతికా అమ్మవారిని సోమవారం పలు రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో శోభాయమానంగా అలంకరించారు. మాలలుగా తయారు చేసిన కూరగాయలే ఆ తల్లికి వస్త్రాభరణాలయ్యాయి. ఈఓ జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యాన అమ్మవారితో పాటు ఆలయాన్ని సైతం కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దివ్యాలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తన్మయులయ్యారు.
సత్యదేవునికి
ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: ఆషాఢ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. వెయ్యి వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.15 లక్షల ఆదాయం సమకూరింది.
ఉదయం ఎండ.. మధ్యాహ్నం కుండపోత
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తీవ్ర స్థాయిలో ఎండ కాయడంతో సత్యదేవుని దర్శనానికి రత్నగిరికి వచ్చిన భక్తులు అల్లాడిపోయారు. పశ్చిమ రాజగోపురం వద్ద చెట్ల నీడను ఆశ్రయించి, సేద తీరారు. అంతలోనే మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురవడంతో తడిసి ముద్దయ్యారు. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు త్వరగా నిర్మించాలని కోరుతున్నారు.
ధరల పట్టిక తప్పనిసరిగా
ప్రదర్శించాలి
కాకినాడ క్రైం: జిల్లాలో రిజిస్టర్ అయిన అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లలో సేవల ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరసింహ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోపు ఏర్పాటు చేసిన ధరల పట్టికల ఫొటోలను
statisticalofficerkakinada@gmail.comకు పంపాలని సూచించారు. అలా పంపని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.