
మిథున్‌రెడ్డి అరెస్టు రాజకీయ కుట్ర
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని రాజకీయ కుట్రగా భావిస్తున్నామని మాజీ ఎంపీ, ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, మిథున్‌రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. మిథున్‌రెడ్డి ఎకై ్సజ్ శాఖకు సంబంధం లేని వ్యక్తి అని, అయినప్పటికీ ఆయనపై తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదు చేయడం తగదని అన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2014–19 మధ్య మద్యం మాఫియా నడిచిందని, 4,380 లిక్కర్ షాపులు, 43 వేల బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను ప్రైవేట్ మాఫియాకు అప్పగించారని అన్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో రాష్ట్రానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం జరిగినట్లు కాగ్ నివేదిక చెబుతోందని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ పాలనలో 43 వేల బెల్ట్ షాపులు మూసివేసి, లిక్కర్ ఔట్‌లెట్లను 4,380 నుంచి 2,934కి తగ్గించారని గీత గుర్తు చేశారు. ఈ–పేమెంట్ విధానం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారదర్శకత తీసుకువచ్చిందన్నారు. మద్యం అమ్మకాలు తగ్గినా రాష్ట్ర ఆదాయం రూ.16,912 కోట్ల నుంచి రూ.24,760 కోట్లకు పెరిగిందని చెప్పారు. లిక్కర్ పాలసీపై వేసిన ఫిర్యాదులను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారించి, 2022 సెప్టెంబర్ 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో మద్యం పాలసీలో ఎవ్వరికీ ఎటువంటి అన్యాయమూ జరగలేదని పేర్కొందన్నారు. వైఎస్సార్ సీపీ తీసుకొచ్చిన మంచి విధానాన్ని నాశనం చేయడానికి, 2014–19లో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఈ అరెస్టుల కుట్రలు చేస్తోందని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రజల పార్టీ అని, తాము ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తామని, మిథున్‌రెడ్డికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని వంగా గీత స్పష్టం చేశారు.