
స్వామిని చూడగ.. మది మురవగ
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుప్రభాత సేవ అనంతరం తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలుత పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. కొత్త ఆలయంతో పాటు పాత గుడి వద్ద కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.2,21,626 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. స్వామివారిని 3,800 మంది దర్శించుకున్నారని, 2,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.