
భూముల వేలంలో పాల్గొననివ్వలేదని ఆందోళన
తొండంగి: కౌలు వేలం ద్వారా శ్రీసంస్థానం భూము లు సాగు చేసుకుంటున్న తమను వేలం ప్రక్రియలో పాల్గొననివ్వకుండా కూటమి పార్టీ నాయకులు, అధికారులు అన్యాయం చేశారంటూ బాధిత రైతులు ఆందోళన నిర్వహించారు. శ్రీసంస్థానం సత్రానికి చెందిన తొండంగిలోని భూములు సుమారు 478 ఎకరాలకు ఈ నెల 14 నుంచి తొండంగి శివాలయంలో కౌలువేలం ప్రక్రియను దేవదాయఽ ధర్మాదాయశాఖ అధికారులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. రోజుకో 30 బిట్లు చొప్పున అధికారులు కౌలువేలం నిర్వహిస్తున్నారు. శుక్రవారం 30 బిట్లుగా 169.16 ఎకరాలకు వేలం నిర్వహించగా రూ.13,56,998 ఆదాయం వచ్చిందని శ్రీసంస్థానం ఈవో నున్న శ్రీరాములు తెలిపారు. గతంలో ఈ భూములకు రూ12,73,800 ఆదాయం రాగా ఈసారి రూ.80198 ఆదాయం పెరిగిందన్నారు. శనివారం మరో 25 బిట్లకు కౌలు వేలం జరుగుతుందని చెప్పారు. కాగా అర్హత ఉన్న కొంతమంది రైతులను కౌలు వేలంలోకి పాల్గొననివ్వకుండా ఆలయం బయట పోలీసుల శాంతిభద్రతల సాకుతో అడ్డుకోవడంతో బాధిత రైతులంతా ఆల యం బయట ఆందోళన నిర్వహించారు. అర్హత ఉన్నప్పటికీ వేలంలో పాల్గొనివ్వలేదని బాధిత రైతులు వాపోయారు. దీంతో వారంతా పోలీసులు, అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దేవదాయధర్మాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సక్రమంగా జరగనందున వేలంను రద్దు చేయాలంటూ బాధిత రైతులు డిమాండ్ చేశారు.