
మోదీ విధానాలతో దేశానికి ప్రమాదం
సామర్లకోట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ అన్నారు. స్థానిక నీలమ్మచెరువు వద్ద జరిగిన సీపీఐ జిల్లా మహాసభకు ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం గాంధీచౌక్‌లో జరిగిన సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు. ప్రధాని మోది మతోన్మాద విధానాలతో దేశం ప్రమాద స్థితిలో ఉన్నదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేసిందని ప్రభాకర్ అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ద్వారా అనేక ప్రజా సమస్యలను పరిష్కరించిందన్నారు. పారిశ్రామిక వేత్తకు రూ.15లక్షల కోట్లు రుణ మాఫీ చేసిన కేంద్రప్రభుత్వం కౌలు రైతులకు రూ.రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి ముందుకు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కాకినాడ నుంచి అమలాపురం వరకు ఉన్న గ్యాస్ నిక్షేపాలను పైపులైన్ ద్వారా మహారాష్ట్ర, గుజరాత్‌లకు తరలిస్తున్నారని, స్థానికంగా లభించే గ్యాస్, పెట్రోలు నిక్షేపాలను స్థానికంగా అందజేస్తే గ్యాస్ సిలిండర్ రూ.100కే వస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి నాయకుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ప్రభుత్వ మద్యం దుకాణాలలో పని చేసే పది వేల కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. వలంటీర్ల పొట్ట కొట్టిన ఘనత చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు దక్కుతుందన్నారు. వలంటీరులకు రూ.10వేలు ఇస్తామని రెండున్నర లక్షల మందిని నమ్మించి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లిస్తే కానీ మద్యం పాటలు జరుపుకోవడానికి వీలు లేదని హుకుం జారీ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ ఉన్నా అడిగే దమ్ము అధికారంలో ఉన్న వారికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు 21 పర్యాయాలు ఢిల్లీ వెళ్తే 21 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. అమరావతికి ఒకసారి శంకుస్థాపన చేసి రెండో పర్యాయం శంకుస్థాపన చేయడం విడ్డూరంగా లేదా అన్నారు. మోది రాష్ట్రం వచ్చిన సమయంలో రూ.700 కోట్లు ఖర్చు అయిందన్నారు. పవన్ కల్యాణ్‌కు చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ బాయ్ అన్నట్లుగా చేశారన్నారు. సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యురాలు పి.దుర్గా భవాని, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్