
మెట్ట జలగలతో జాగ్రత్త
ఉద్యాన శాఖాధికారి సోమరాజశేఖర్
పిఠాపురం: మెట్ట జలగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రారంభ దశలోనే నివారణకు చర్యలు తీసుకోవాలని పిఠాపురం ఉద్యాన శాఖాధికారి వై.సోమరాజశేఖర్ రైతులకు సూచించారు. ఆయన మంగళవారం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పర్యటించి మెట్ట జలగలు సోకిన పంటలను పరిశీలించారు. ఇటీవల గొల్లప్రోలు మండలంలో వివిధ పంటలకు మెట్ట జలగలు సోకి తీవ్ర నష్టాలను కలిగించిన వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో ‘జల గండం’ శీర్షికన వెలువడిన కథనానికి ఉద్యాన శాఖాధికారులు స్పందించారు. ఆయన మాట్లాడుతూ వాణిజ్య పంటల్లో మెట్ట జలగలను గమనించామన్నారు. ఎక్కువగా మిరప, బొప్పాయి వంటి తోటల్లో కనిపించాయని, వీటిని తొలి దశలోనే నివారించక పోతే ఎక్కువ మొత్తంలో పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. పొలంలో తడి తగ్గించడమే కాక సాయంత్రం నీరు పెట్ట కూడదన్నారు. మిరప తోటలో కలుపు, వాడిన ఆకులు పూర్తిగా తొలగించుకోవాలన్నారు. మెట్ట జలగలకు ఆశ్రయం కలిగించే చెట్లను తొలగించాలని, రాళ్లు, చెత్త లేకుండా చూసుకుంటూ పొదల కింద వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మెటాల్డిహైడ్ బైట్ 2.5 శాతం,1 నుంచి 2 కిలోలు ఎకరాకు ఇసుకలో కలిపి వేసుకోవాలన్నారు. ఐరన్ ఫాస్ఫేట్ బైట్ 2 నుంచి 4 కిలోలు ఎకరాకు సాయంత్రం వేళ పొలం చుట్టూ లేదా మిరప రద్దెల మధ్య చల్లుకోవాలన్నారు. దీనిని వర్షం వచ్చి పోయిన తర్వాత మళ్లీ వేయడం అవసరమన్నారు. పొగాకు పొడిని చేను అంతటా తడిగా ఉన్నప్పుడు చుట్టూ చల్లు కోవడం ద్వారా వీటిని నియంత్రివచ్చని తెలిపారు. వర్షం వచ్చి పోయిన తరువాత పొలం పరిశీలించడం ద్వారా వీటి ఉనికిని గమనించవచ్చన్నారు. పొలాల్లో మెట్ట జలగలు, నత్తలు కనిపిస్తే వెంటనే రైతు సేవా కేంద్రం ద్వారా ఉద్యాన శాఖ సిబ్బందికి తెలియజేస్తే వారు నివారణ చర్యలు సూచిస్తారన్నారు.