విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన 168 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి.నారాయణ తదితరులు ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, షైనింగ్ స్టార్స్–2025 కింద జిల్లాలో మండలానికి ఆరుగురు చొప్పున 132 మంది పదో తరగతి విద్యార్థులను, వివిధ కేటగిరీల్లో 36 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేశామని చెప్పారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ తదితరులు కూడా ప్రసంగించారు. తొలుత ప్రతిభా పురస్కారానికి ఎంపికై న విద్యార్థులు, తల్లిదండ్రులతో కలెక్టర్ షణ్మోహన్ నేరుగా మాట్లాడారు. ఉత్తమ మార్కులు సాధించడానికి గల కారణాలు, తల్లిదండ్రుల వివరాలు, తమ పాఠశాల, కళాశాలల్లోని వసతులు, తదుపరి చదువులకు ఎంచుకున్న కోర్సులు, భవిష్యత్తు ప్రణాళికలను ఆయా విద్యార్థులు వివరించారు. కాకినాడ రూరల్ మండలం స్వామి జూనియర్ కళాశాలకు చెందిన దివ్యాంగ విద్యార్థిని విసరపు హాసినిశ్రీ, సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని చిడత శివలక్ష్మిని దత్తత తీసుకుంటామని ఎమ్మెల్సీ రాజశేఖరం, ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలు, అభిరుచులు తెలుపుతూ విద్యార్థులు స్వయంగా రాసి, అందంగా చిత్రించిన షైనింగ్ స్టార్స్ వాల్స్‌ను అతిథులు వీక్షించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా పాఠశాల విద్యా శాఖ అధికారి పి.రమేష్, ఎస్‌ఎస్‌ఏ పీఓ పి.వేణుగోపాలరావు, డీఐవో ఐ.శారద పాల్గొన్నారు.


