
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు
● మాజీ మంత్రి రజనీపై పోలీసుల
దౌర్జన్యం దారుణం
● సీఐ సుబ్బనాయుడిపై చర్య తీసుకోవాలి
● మాజీ ఎంపీ వంగా గీత,
మహిళా నేతల డిమాండ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత అన్నారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ఎటువంటి రక్షణా లేదని అన్నారు. మాజీ మహిళా మంత్రి అనే గౌరవం కూడా లేకుండా విడదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి, చేయి చేసుకోవడం దారుణమని, మహిళల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పే కూటమి నాయకులు ఏమైపోయారని మండిపడ్డారు. విషయం ఏమిటో చెప్పాలని రజనీ కోరినా సీఐ సుబ్బనాయుడు దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. ఒక బీసీ ప్రజాప్రతినిధిపై ఇలా ప్రవర్తించడం సరి కాదన్నారు. మాజీ మంత్రి వద్ద ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటే వారెంట్ లేదా ఎఫ్‌ఐఆర్ చూపాలని, ఎటువంటి నోటీసులూ లేకుండా అరెస్టు చేయడం వెనుక ఆంతర్యమేమిటని గీత ప్రశ్నించారు. మాజీ మహిళా ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని భ్రమపడుతున్నారని అన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. దుస్తులు మార్చుకుని వస్తానన్నా కూడా సమయం ఇవ్వకుండా ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. పోలీసులు ఎవరి మెప్పు కోసం పని చేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఏ సంక్షేమ పథకమూ అమలు చేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మహిళలు అధిక ప్రాధాన్యం, రక్షణ కల్పించారని గీత అన్నారు.
పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మాట్లాడుతూ, మాజీ మంత్రి రజనీపై పోలీసులు తీరు అమానుషమన్నారు. మహిళలకు ఎంతో గౌరవం ఇస్తామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత మాట్లాడుతూ, పోలీసులు తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని, నారా లోకేష్ మెప్పు కోసం రెడ్‌బుక్ రాజ్యాంగా అమలు చేస్తున్నారని అన్నారు. రజనీపై అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బనాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర మహిళా అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.