రైతు కష్టం.. వర్షార్పణం | - | Sakshi
Sakshi News home page

రైతు కష్టం.. వర్షార్పణం

May 5 2025 8:38 AM | Updated on May 5 2025 8:38 AM

రైతు

రైతు కష్టం.. వర్షార్పణం

ముంచేసిన కుండపోత వర్షాలు

తడిసిపోయిన ధాన్యం

బరకాలు కప్పినా ఫలితం శూన్యం

అన్నదాతల కన్నీరు

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రస్తుతం మే నెల.. ఈపాటికి ఎండలు మండిపోతూ ఉంటాయి. కొద్ది రోజుల ముందు వరకూ ఇదే పరిస్థితి. కానీ, రెండు రోజులుగా వాతావరణంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురస్తున్నాయి. ఆదివారమైతే కుండపోత వర్షమే కురిసింది. ఫలితంగా చేతికి అందివచ్చిన పంట కళ్ల ముందే నీటిపాలవడంతో రైతన్నలు ఆవేదనలో మునిగిపోయారు. పంట ఎక్కడ దక్కకుండా పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. వర్షానికి గాలులు తోడవడంతో అక్కడక్క ఇంకా కోతలు కోయని వరి పైరు నేలకు ఒరిగిపోతోంది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యం వెంటనే అమ్ముకుందామన్నా కూటమి సర్కారు నిర్వాకంతో కొనే వారు లేకుండా పోయారు. తేమ శాతాన్ని సాకుగా చూపి బస్తాకు రూ.200 నుంచి రూ.300 తక్కువ ఇస్తామని చెబుతూండటంతో రైతులు ఆ ధాన్యాన్ని కళ్లాలు, రోడ్ల పక్కన ఆరబెట్టారు. తేమ శాతం తగ్గిన తర్వాత అమ్ముకుందామని అనకుంటే వారి ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. పంట చివరి దశకు చేరుకున్న తరుణంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు మండలాల్లో బరకాలతో కప్పిన ధాన్యపు రాశులు తడిసిపోయాయి. ఈ పరిస్థితుల్లో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

70 శాతం కోతలు పూర్తి

జిల్లావ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల్లో రైతులు రబీ వరి సాగు చేశారు. ఇప్పటికే 70 శాతం కోతలు పూర్తికావచ్చాయి. వాతావరణం అనుకూలించడం, తెగుళ్ల బెడద లేకపోవడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంది. మొత్తం 5.79 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 3.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మరో 2.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతులు వద్ద ఉంది. రైతులు నూర్పిళ్లు చేసి, ధాన్యం అమ్మేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మిల్లర్లు తేమ శాతం సాకుగా చూపడంతో ధాన్యం ఆరబెట్టుకొన్నారు. సామర్లకోట, జగ్గంపేట, కిర్లంపూడి, తుని, తొండంగి, కరప, కాకినాడ రూరల్‌, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో రైతులు అధికంగా ధాన్యాన్ని కళ్లాలు, రోడ్ల పక్కన ఆరబెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సుమారు గంటకు పైగా జోరు వాన కురిసింది. దీంతో ఆయా మండలాల్లో రైతులు ఆరబెట్టుకొన్న ధాన్యపు రాశులు తడిసిపోయాయి. ఆదివారం ఉదయం ఎండ కాయడంతో రైతులు మళ్లీ ధాన్యం ఎడబెట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. అంతలోనే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి కుండపోత వర్షం కురిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎడతెరిపి లేని వర్షం కురవడంతో జిల్లావ్యాప్తంగా రైతులు ఆరబెట్టుకున్న ధాన్యపు రాశులు, ఇంకా కోత కోయని వరి చేలు తడిసి ముద్దయ్యాయి.

యంత్ర కోతలతో తేమ షాకు

పలువురు రైతులు యంత్రాలతో వరి కోతలు కోయించారు. ఇదే అదనుగా మిల్లర్లు తేమ శాతం బూచిగా చూపి ధాన్యం రేటులో భారీగా కోత పెడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం 75 కేజీల ధాన్యం బస్తాను రూ.1,725కు కొనుగోలు చేయాల్సి ఉండగా.. రూ.1,500కు కొంటున్నారు. దీంతో బస్తాకు రూ.225 వరకూ రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యానికి రేటు మరింత తగ్గిస్తారేమోనని, మిల్లర్లు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తుందేమోనని, అదే జరిగితే నష్టపోతామని రైతులు కలత చెందుతున్నారు. రబీలో ఎకరాకు సగటున 40 బస్తాల మేర ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వ మద్దతు ధర దక్కకపోవడంతో ఎకరానికి రూ.9 వేల మేర రైతులు నష్టపోతున్నారు.

ధాన్యం తడిసి ముద్దయ్యింది

తేమ శాతం ఎక్కువగా ఉండటంతో 500 బస్తాల ధాన్యం ఆరబెట్టాం. అకస్మాత్తుగా వర్షం రావడంతో ధాన్యం ముద్దయిపోయింది. ఇప్పుడు తడిసిన ధా న్యం కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ రావడం లేదు. ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.

– శివకోటి సురేష్‌, రైతు, కాట్రావులపల్లి, జగ్గంపేట మండలం

కౌలు రైతులకు మరింత నష్టం

సొంతంగా వ్యవసాయ భూమి ఉన్న రైతులు ప్రస్తుత వర్షాల కారణంగా గిట్టుబాటు ధర దక్కకపోయినా అయిన కాడికి పంటను అమ్ముకుంటున్నారు. కానీ, కౌలు రైతులు మాత్రమే పంటను విక్రయించేందుకు సంకోచిస్తున్నారు. ఎకరం భూమికి కౌలు రూ.30 వేలు చెల్లించాలి. మరో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ పెట్టుబడి అయ్యింది. దీంతో, నష్టానికి ధాన్యం అమ్ముకోవడానికి కౌలు రైతులు వెనుకంజ వేస్తున్నారు. తమ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని వాపోతున్నారు. ఎకరాకు రూ.9 వేలకు పైగా నష్టపోవాల్సి రావడంతో బరకాలు కప్పి ధాన్యపు రాశులను రక్షించుకొంటున్నారు. ఎండలు కాసిన తర్వాత ఆరబెట్టి ధాన్యాన్ని విక్రయించుకునేందుకు నానా పాట్లూ పడుతున్నారు. వర్షాలు ఎక్కువయితే రేటు మరింత తగ్గే ప్రమాదం ఉంటుందని భావిస్తున్న మరికొందరు కౌలు రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ ధరకే ధాన్యం విక్రయించుకుంటున్నారు.

రైతు కష్టం.. వర్షార్పణం1
1/2

రైతు కష్టం.. వర్షార్పణం

రైతు కష్టం.. వర్షార్పణం2
2/2

రైతు కష్టం.. వర్షార్పణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement