ఫ సంద్రం వీడి.. తీరం చేరి..
ఉవ్వెత్తున ఎగసి పడే అలలను చీల్చుకుంటూ.. సాగరంతో సయ్యాటలాడుతూ.. రేయింబవళ్లు నడిసంద్రంలో జీవన పోరాటం చేసే మత్స్యకారులకు రెండు నెలల పాటు విశ్రాంతి లభించింది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు బంగాళాఖాతంలో చేపల వేటపై బుధవారం నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. జూన్ 14వ తేదీ వరకూ ఈ నిషేధం అమలు కానుంది. దీంతో, పది నెలలుగా సముద్రంలో చేపలు వేటాడుతూ జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులు వేటను నిలిపి వేశారు. చాలా వరకూ బోట్లు ఇప్పటికే తీరానికి చేరుకున్నాయి. సముద్రం మధ్యన.. సుదూర ప్రాంతంలో ఉన్న బోట్లు మాత్రం తీరం చేరేందుకు ఒకటి రెండు రోజులు పట్టే అవకాశముంది. కాకినాడ ఫిషింగ్ హార్బర్, కుంభాభిషేకం, జగన్నాథపురం ఏటిమొగ వద్దకు భారీగా బోట్లు చేరుకున్నాయి. వాటిని యజమానులు భద్రంగా కాపాడుకుంటున్నారు. అవసరమైన వాటికి మరమ్మతులు నిర్వహించుకోనున్నారు.
– కాకినాడ రూరల్


