ఎట్టకేలకు పారిశుధ్య నిర్వహణ టెండర్ విడుదల
అన్నవరం దేవస్థానం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంతో సహా రాష్ట్రంలోని ఏడు దేవస్థానాలలో శానిటరీ మెటీరియల్‌తో సహా క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజడ్ టెండర్ ప్రకటన మంగళవారం విడుదలైంది. రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ ప్రొక్యూర్ టెండర్ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం శానిటరీ టెండర్లు పిలిచి ఖరారు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని దాదాపు ఆరు నెలలు ఆలస్యం చేశారు. గత అక్టోబర్‌లో విడుదల కావల్సిన టెండర్ ఆరునెలలు ఆలస్యం వచ్చింది. టెండర్లు దాఖలుకు అభ్యర్థన తేదీ ఈ నెల 16, ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న, టెండర్ దాఖలుకు చివరి తేదీ మే ఒకటి, మే ఐదున టెండర్ టెక్నికల్ బిడ్ తెరుస్తారు. మే 12న ఖరారు చేస్తారు. జూన్ ఒకటి నుంచి కొత్త కాంట్రాక్ట్ ప్రారంభమవుతుంది. కాగా.. చెత్త ట్రాక్టర్ కాంట్రాక్టును టెండర్ పిలవకుండా నెలకు రూ.60 వేలకు అప్పగించడంతో సాక్షిలో వార్త వచ్చిన విషయం తెలిసిందే. దీంతో టెండర్లు పిలిచి, అతి తక్కువకు దాఖలైన రూ.23,990కు ఖరారు చేశారు. దీంతో దేవస్థానానికి నెలకు రూ.30,010 ఆదా అయ్యింది.


