లక్ష్మీ.. రావేం మా కొండకి?
వ్యయం
కేటగిరీ రూ.కోట్లలో
సిబ్బంది జీతభత్యాలు 23.35
పెన్షన్లు 13.71
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ 8.10
ప్రసాదం సరకుల కొనుగోళ్లు 23.17
వ్రతాల విభాగం కొనుగోళ్లు 5.05
పడితరం, పూజలు 00.51
ఉత్సవాల ఏర్పాట్లు 1.63
పురోహితులు, ఇతరుల పారితోషికాలు 16.00
శానిటేషన్ 6.60
ధర్మ ప్రచారం 00.50
ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ 2.11
ట్రాన్స్‌పోర్టు 1.43
విద్యాసంస్థలు, దత్తత ఆలయాలు 5.09
ఎస్‌పీఎఫ్, సెక్యూరిటీ గార్డులు 4.36
సీజీఎఫ్, ఇతర చెల్లింపులు 12.49
వివిధ నిర్మాణాలు 12.75
ఎలక్ట్రికల్ వర్క్స్ కొనుగోళ్లు 4.53
ఇతర ఖర్చులు 00.04
మొత్తం (సుమారు) 141.49
ఇతర వ్యయాలు, అడ్వాన్సులు, డిపాజిట్లు రూ.6.05 కోట్లు
● రత్నగిరి వాసుడిని
కటాక్షించని శ్రీమహాలక్ష్మి
● ఖర్చుకు రూ.6 కోట్ల దూరంలో
సత్తెన్న ఆదాయం
● 2024–25లో రాబడి రూ.135 కోట్లు
● వ్యయం రూ.1.41 కోట్లు
● అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఆదాయానికి భారీగా గండి
అన్నవరం: అనుకున్నదే జరిగింది.. రత్నగిరి వాసుడు సత్యదేవుడిని లక్ష్మీదేవి పూర్తి స్థాయిలో కరుణించలేదు. ఫలితంగా ఒకప్పుడు మిగులు నిధులతో, సిరిసంపదలతో తులతూగిన అన్నవరం దేవస్థానంలో ఇప్పుడు రాబడి తగ్గి, ఖర్చు పెరిగింది. ఫలితంగా 2024–25లో వ్యయం కన్నా వార్షికాదాయం రూ.6 కోట్లు తక్కువగా నమోదైంది. గత ఏడాది సగం గడిచినప్పటి నుంచే ఈ పరిస్థితి కనిపిస్తున్నా చక్కదిద్దడంలో అధికారులు విఫలమవడం.. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో దేవస్థానం ఆర్థిక పరిస్థితి దిగజారింది. 2019–24 మధ్య ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో కరోనా విపత్తు రెండేళ్లు పంజా విసిరి, భక్తుల రాక తగ్గినా.. దేవస్థానం ఆదాయంపై ఆ ప్రభావం పడలేదు. అటువంటిది కూటమి పది నెలల పాలనలో అంతా సజావుగా ఉన్నా ఆదాయం పెరగకపోవడం గమనార్హం.
ఖర్చయిపోయిందిలా..
అన్నవరం దేవస్థానానికి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.135,69,42,831 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఖర్చు వ్యయం రూ.141,49,16, 971 అయింది. దీంతో దేవస్థానం ఆదాయం కన్నా వ్యయం సుమారు రూ.6 కోట్లు అధికంగా నమోదైంది. ఇటీవలి కాలంలో ఈవిధంగా ఆదాయం తగ్గి, ఖర్చు పెరగడం ఇదే ప్రథమం.
ప్రదక్షిణ దర్శనం రద్దుతో రూ.5 కోట్ల నష్టం
సత్యదేవుని ఆలయంలో రూ.300 టికెట్టుతో ప్రదక్షిణ దర్శనాన్ని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ ప్రారంభించారు. ఆలయంలో నాలుగు మూలలా శ్రీగంధం గిన్నె, లక్ష్మీ హుండీ, పారిజాత వృక్షం, కామధేనువు విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఈ ప్రదక్షిణ దర్శనానికి మొగ్గు చూపేవారు. 2023 అక్టోబర్‌లో ఈ దర్శనం ప్రారంభిస్తే నెల రోజుల్లోనే సుమారు రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. అయితే, ఆజాద్ బదిలీ తరువాత ఈఓగా వచ్చిన కె.రామచంద్ర మోహన్ ఈ దర్శనాన్ని నిలిపివేశారు. ఆయన తరువాత ఈఓగా వచ్చిన వీర్ల సుబ్బారావు కూడా దీనిని పునరుద్ధరించలేదు. ఈ ప్రదక్షిణ దర్శనం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో దేవస్థానం ఏటా సుమారు రూ.6 కోట్ల మేర ఆదాయం కోల్పోయింది.
గత ఏడాది మిగులుతో వ్యయాల సర్దుబాటు
గత ఏడాది రూ.7 కోట్లు మిగలడంతో ఆ మొత్తంలో రూ.6 కోట్లు ఈ ఏడాది వ్యయాలకు సర్దారు. 12 ఏళ్ల క్రితం కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడు వ్యయం రూ.కోటి మాత్రమే ఎక్కువైంది. వైఎస్సార్ సీపీ పరిపాలనలో 2020, 2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ కారణంగా ఆదాయం తగ్గినప్పటికీ దేవస్థానం వెంటనే రికవరీ అవడంతో లోటు కనిపించలేదు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, చిన్నచిన్న విషయాలను కూడా పెద్ద వివాదాలుగా మార్చడం, దేవస్థానంపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయినా సిబ్బంది సలహాల ప్రకారం కాకుండా సొంత అజెండాతో వ్యవహరించడం వంటి చర్యలతో దేవస్థానం ప్రతిష్ట మసకబారుతోంది. ఫలితంగా భక్తుల రాక తగ్గి, ఆదాయం తగ్గుతోంది. ఇటీవల అధికారులు తీసుకున్న నిర్ణయమే దీనికి తాజా ఉదాహరణ. నీటి సమస్య సాకుతో ఏసీ గదులను ఒక రోజు అద్దెకివ్వకపోవడంతో దేవస్థానం సుమారు రూ.లక్ష ఆదాయం కోల్పోయింది. ఆ తరువాత ఏసీ గదులు అద్దెకివ్వడం పునరుద్ధరించినా ఇప్పటికీ వాటిని అద్దెకివ్వడం లేదనే భావనే భక్తుల్లో ఉంది.
అన్నవరం దేవస్థానం
2024–25 ఆర్థిక సంవత్సరం ఆదాయ వ్యయాల వివరాలు
ఆదాయం రూ.కోట్లలో
వ్రతాలు 38.40
ప్రసాదాల విక్రయం 33.07
హుండీల ద్వారా 18.79
షాపుల వేలం, లీజులు 15.77
వసతి గదుల అద్దెలు 12.27
ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 5.49
ఇతర ఆర్జిత సేవలు 4.13
ట్రాన్స్‌పోర్టు 2.03
డిపాజిట్లపై వడ్డీలు 4.80
కేశఖండన టికెట్ల ద్వారా 00.94
మొత్తం (సుమారు) 135.69
అడ్వాన్సులు, డిపాజిట్లు,
క్యాపిటల్ డొనేషన్లు 7.20


