
బీచ్‌లో భారీ పోలీసు బందోబస్తు
కాకినాడ రూరల్: భారత్ – అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల నేపథ్యంలో కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నుంచి బీచ్ రోడ్డును మూసివేశారు. దీంతో లైట్‌హౌస్ మీదుగా బీచ్ రోడ్డులో ఉప్పాడకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల 13వ తేదీ వరకూ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేయడంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు బీచ్‌కు రాకుండా నిషేధించారు. సుమారు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్యకృష్ణ, తిమ్మాపురం ఎస్‌హెచ్‌ఓ, ట్రైనీ ఐపీఎస్ అధికారి సుష్మితలు బీచ్‌లో 130 మంది సిబ్బందికి విధులు కేటాయించారు.
స్తంభించిన
ఎన్టీఆర్ వైద్య సేవలు
కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) సోమవారం స్తంభించిపోయాయి. ప్రభుత్వ నిర్వాకంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు తలపెట్టిన సమ్మె పేదల ఆరోగ్యంపై గుదిబండగా మారింది. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ ఎన్టీఆర్ వైద్య సేవల కింద కార్పొరేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో 80 నుంచి 110 సర్జరీలు ఉచితంగా జరుగుతూంటాయి. అటువంటిది సోమవారం ఒక్క సర్జరీ కూడా నమోదు కాలేదు. జిల్లాకు రావలసిన సుమారు రూ.150 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసేంత వరకూ సమ్మె విరమించేది లేదని ఏపీ స్పెషాలిటీ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, రాష్ట్ర నాయకత్వం హాజరు కానుందని, చర్చల అనంతరం కొనసాగింపుపై మరింత స్పష్టత వస్తుందని వారు తెలిపారు.
స్వయం ఉపాధికి
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ సిటీ: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 3,318.25 లక్షల విలువైన 798 యూనిట్లు మంజూరు చేశారన్నారు. వీటికి సబ్సిడీ కింద రూ.1310.10 లక్షలు, బ్యాంకు రుణం రూ.1,824.24 లక్షలు, లబ్ధిదారు వాటా రూ.165.91 లక్షలుగా నిర్ణయించారని వివరించారు. దీని ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు రూ.2.50 లక్షల నుంచి రూ.20 లక్షల విలువైన 32 రకాల స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న ఎస్సీ యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత వెబ్‌సైట్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి అందుబాటులోకి వస్తుందని, దీని ద్వారా వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. పూర్తి వివరాలకు సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో సంప్రదించాలని సత్యవతి సూచించారు.
పీజీఆర్‌ఎస్‌కు 478 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు 478 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, సీపీఓ పి.త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, కేఎస్‌ఈజెడ్ ఎస్‌డీసీ కేవీ రామలక్ష్మి తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటికి సత్వరమే సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
శ్రీనూకాంబిక ఆలయ
అభివృద్ధికి విరాళం
ఆలమూరు: చింతలూరు నూకాంబికా అమ్మవారి ఆలయ అభివృద్ధికి గుమ్మిలేరుకు చెందిన వ్యాపారవేత్త ముత్యాల వీర భాస్కరరావు, కృష్ణవేణి దంపతులు సోమవారం రూ.1,01,116 అందజేశారు. గాలి గోపురం నిర్మాణానికి ఈ విరాళం ఇచ్చారు. ఈఓ ఉండవల్లి వీర్రాజు చౌదరి, ఉత్సవ కమిటీ చైర్మన్ గన్ని వెంకట్రావు (అబ్బు)కు నగదు రూపంలో ఆలయ ఆవరణలో అందజేశారు.

బీచ్‌లో భారీ పోలీసు బందోబస్తు