మర్యాద పూర్వకంగా..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను గురువారం తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల ఎస్పీలు డి.నరసింహ కిషోర్, బి.కృష్ణారావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
సామర్లకోట: స్థానిక కెనాల్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం సామర్లకోట మండలం జి.మేడపాడు గ్రామానికి చెందిన దాడిశెట్టి రాజు (28) తన చెల్లెలతో కలిసి సామర్లకోట నుంచి స్కూటీపై స్వగ్రామం వెళుతూ ఉండగా హుస్సేన్‌పురం సమీపంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొంది. దాంతో స్కూటీ నడుపుతున్న రాజు రోడ్డుపై పడి పోయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీపై ఉన్న ఇద్దరు యువతులకు గాయాలు తగలడంతో హుస్సేన్‌పురం స్థానికుడు చల్లా బుజ్జి 108కు సమాచారం ఇచ్చి, ఆ వాహనంలో వైద్యం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి సామర్లకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపారి ఖాతా నుంచి
రూ.40,600 చోరీ
మామిడికుదురు: మామిడికుదురుకు చెందిన కొబ్బరి కాయల వ్యాపారి రజా హుస్సేన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.40,600 చోరీ చేసిన ఘటనపై బాధితుడు గురువారం నగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజా హుస్సేన్ బ్యాంకు ఖాతాకు బుధవారం అప్పనపల్లికి చెందిన కొబ్బరి కాయల వ్యాపారి రూ.50 వేలు జమ చేశారు. దానిలో రూ.10 వేలు మామిడికుదురులో ఏటీఎం ద్వారా హుస్సేన్ డ్రా చేశారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రజా హుస్సేన్ కదలికలను గమనిస్తున్నాడు. ఏటీఎం నుంచి డబ్బులు వచ్చిన తర్వాత నగదు తీసుకునే హడావుడిలో హుస్సేన్ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలోని కార్డు తీసి మీ కార్డు తీసుకోండని వేరే కార్డు హుస్సేన్‌కు ఇచ్చాడు. ఇది గమనించని హుస్సేన్ ఇంటికి వెళ్లిపోయాడు. అతని కార్డు నుంచి పాశర్లపూడి ఏటీఎం నుంచి కొంత, నగరం పెట్రోల బంకు ద్వారా కొంత మొత్తం రూ.40,600 గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. రజా హుస్సేన్ గురువారం మామిడికుదురు ఎస్‌బీఐకి నగదు డ్రా చేసేందుకు వెళ్లగా విషయం బయట పడింది. తాను మోసపోయానని గ్రహించి, నగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై పి.సురేష్‌ను వివరణ కోరగా దీనిపై పరిశీలన చేస్తున్నామన్నారు.
మర్యాద పూర్వకంగా..


