
ఒక కోర్సు చదివితే మరో కోర్సుకు సర్టిఫికెట్
కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ఆందోళన
కాకినాడ సిటీ: తాము ఒక కోర్సు చదివితే, కాకినాడ పైడా కళాశాలలో (పీవీఆర్ ట్రస్ట్) మరో కోర్సుకు సర్టిఫికెట్ ఇస్తున్నారని, దీనివల్ల తాము చదివిన చదువుకు అర్థం లేకుండా పోయిందని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ కళాశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్ జె.నివాస్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజీకి చెందిన తామంతా బీఎస్సీ కోర్సు చేస్తే వారు ఒకేషనల్ కోర్సు సర్టిఫికెట్ అందిస్తున్నారని వివరించారు. మూడేళ్లుగా ఒక్కొక్కరం రూ.3.5 లక్షల చొప్పున ఫీజు చెల్లించి చదువుకున్నామన్నారు. తమ ముందు బ్యాచ్ విద్యార్థులు బీఎస్సీ చదివితే వారికీ ఒకేషనల్ కోర్సు చేసినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని, ఇప్పుడు ఆ సర్టిఫికెట్ చెల్లదని వైద్య, ఆరోగ్య శాఖ చెప్పడంతో వారికి తీరని నష్టం కలిగిందని పేర్కొన్నారు. తమకు కూడా నష్టం జరుగుతుందేమోననే భయంతో కళాశాల యాజమాన్యాన్ని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, విద్యార్థుల సమస్యను బీజేపీ నేతలు గట్టి సత్యనారాయణ, చిలుకూరి రామ్‌కుమార్ తదితరులు అడిగి తెలుసుకున్నారు. వారికి న్యాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.