స్ట్రాంగ్‌ రూముల భద్రతపై నిరంతర పర్యవేక్షణ | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూముల భద్రతపై నిరంతర పర్యవేక్షణ

Published Tue, May 21 2024 10:35 AM

స్ట్ర

సందేహాలుంటే అధికారులను సంప్రదించాలి

కలెక్టర్‌ నివాస్‌

కాకినాడ సిటీ: పోలింగ్‌ అనంతరం ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూముల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. జేఎన్‌టీయూకేలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంట్రల్‌ లైబ్రరీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమును, స్టూడెంట్స్‌ క్యాంటీన్‌పై ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల కంట్రోల్‌ రూమును ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌, రిటర్నింగ్‌ అధికారుల(ఆర్‌ఓ)తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూ ముల భద్రత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామగ్రిని వర్సిటీలోని స్ట్రాంగ్‌ రూముల్లో సురక్షితంగా భద్రపరిచామని తెలిపారు. వీటికి రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో సీలు వేశామన్నారు. స్ట్రాంగ్‌ రూములను నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. స్ట్రాంగ్‌ రూముల భద్రతను పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు పరిశీలించేందుకు వీలుగా స్టూడెంట్స్‌ క్యాంటీన్‌ పైన ఉన్న యోగా సెంటర్‌లో సీసీ టీవీ కెమెరాల కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశామని తెలిపారు. స్ట్రాంగ్‌ రూముల భద్రతను ఆయా ఆర్‌ఓలతో పాటు షిఫ్ట్‌ల పద్ధతిలో ఒక గెజిటెడ్‌ అధికారి, ఒక పోలీస్‌ అధికారి, ఇతర సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తున్నారని వివరించారు. స్ట్రాంగ్‌ రూముల భద్రతపై సందేహాలుంటే ఆయా అభ్యర్థులు, ఏజెంట్లు నేరుగా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ నివాస్‌ చెప్పారు. ఆ రోజున రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల వాహనాల పార్కింగ్‌, పాస్‌లు తదితర అంశాలపై పూర్తి సమాచారం తెలియజేస్తామని తెలిపారు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే లోపలకు అనుమతి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

బందోబస్తు కట్టుదిట్టం

ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. జేఎన్‌టీయూకేలోని స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై ర్యాంక్‌ అధికారులతో పాటు మరో ముగ్గురు అధికారులు సమన్వయ లోపం లేకుండా స్ట్రాంగ్‌ రూముల భద్రతను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఆర్‌ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూముల భద్రతపై నిరంతర పర్యవేక్షణ
1/1

స్ట్రాంగ్‌ రూముల భద్రతపై నిరంతర పర్యవేక్షణ

Advertisement
 
Advertisement
 
Advertisement