No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, Nov 12 2023 2:54 AM

- - Sakshi

సినీ నటుడు చంద్రమోహన్‌కు ఈ నేలతో ప్రత్యేక అనుబంధం

ఆయన సినిమాల షూటింగ్‌లు చాలా వరకూ ఇక్కడే.. విలక్షణ నటుడి మృతితో అభిమానుల్లో విషాదం

సన్నివేశానికి అనుగుణంగా కాస్తంత చిలిపితనం.. సునిశితమైన హాస్యం.. అందరికీ అలవోకగా అర్థమయ్యేలా డైలాగులు చెప్పగలిగిన నేర్పు.. గుండెల్ని బరువెక్కించే విషాదం.. భావమేదైనా ప్రేక్షకుల మెప్పు పొందేలా పండించగల నటకౌశలం.. ఇటువంటి సులక్షణాలు కలిగిన విలక్షణ ప్రతిభాసంపన్నుడు చంద్రమోహన్‌.నాటి తరం అమ్మాయిల మనస్సుల్ని ఊయలలూగించిన అందం.. అప్పటి యువకులు సైతం అనుకరించాలని అనుకునే వంకీలు తిరిగి చక్కటి హెయిర్‌ స్టైల్‌.. నింగిలో ప్రకాశించే నెలవంకలాంటి అందమైన చిరునవ్వు.. అద్భుతమైన హావభావాలు ఆయన సొంతం.ఆ వెండితెర నిండు చంద్రుడు.. నింగికేగిపోయాడని తెలిసిన గోదారి సీమ విచారంలో మునిగింది. ఈ నేలతో ఆ సినీ నటుడి అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంది.

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)/అన్నవరం/అమలాపురం టౌన్‌/కొత్తపేట/రామచంద్రపురం/రాయవరం/మధురపూడి: ‘గుప్పెడు హైట్‌ ఉంటే ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లను మించిపోయేవాడురా..’ ఇండస్ట్రీలో చంద్రమోహన్‌ గురించి తరచూ వినిపించే మాట. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన శనివారం మృతి చెందారని తెలిసి అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సహ నాయకుడిగా, కథానాయకుడిగా, హాస్య నటునిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చంద్రమోహన్‌ ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు పోషించారు. ఆయనకు గోదావరితో, ఈ నేలతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన సినిమాలు అనేకం ఇక్కడే షూటింగ్‌ జరుపుకొన్నాయి.

జ్ఞాపకాల దొంతర

● రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాలలో చంద్రమోహన్‌ 1960–61లో ఇక్కడి సీనియర్‌ సినీ నటుడు శ్రీపాద జిత్‌మోహన్‌ మిత్రాతో కలిసి పీబీసీ చదువుకున్నారు. వీరి మధ్య అప్పుడు ఏర్పడిన స్నేహం చిరకాలం కొనసాగింది. వీరిద్దరూ 15కు పైగా సినిమాల్లో కలసి నటించారు.

● ఉమ్మడి జిల్లాలో చిత్రీకరించిన బంగారు పిచ్చుక, అల్లూరి సీతారామరాజు, ప్రాణం ఖరీదు, సీతామాలక్ష్మి, శంకరాభరణం తదితర హిట్‌ చిత్రాల్లో చంద్రమోహన్‌ నటించారు.

● కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ పేరొందారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ల వయసుతో నట జీవితం ప్రారంభించిన శ్రీదేవి.. చంద్రమోహన్‌ సరసన నటించి.. తరువాత తారాపథంలో దూసుకువెళ్లారు. ఇలాగే అనేక మంది హీరోయిన్లకు ఆయన లక్కీ హీరో.

● చంద్రమోహన్‌కు బాగా పేరు తెచ్చిన చిత్రాల్లో ఒకటైన శంకరాభరణం సినిమా షూటింగ్‌ అన్నవరం పుణ్యక్షేత్రంలో 1980లో జరిగింది. ఈ సినిమాలో హీరో చంద్రమోహన్‌, హీరోయిన్‌ రాజ్యలక్ష్మి పరిచయం, వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం వంటి సన్నివేశాలను రత్నగిరి మెట్ల మార్గం, సత్యదేవుని ఆలయ పరిసరాల్లో షూట్‌ చేశారు. చంద్రమోహన్‌ బామ్మగా నటించిన నిర్మలమ్మ చేతికి మరచెంబు ఇస్తూండగా అది కాస్తా రత్నగిరి మెట్ల దారిలో జారి పడిపోవడం, వెనుకన మెట్లపై వస్తున్న రాజ్యలక్ష్మి ఆ మరచెంబును చంద్రమోహన్‌కు ఇవ్వడం.. సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేసే సమయంలో హీరో, హీరోయిన్ల మధ్య చిల్లర డబ్బులు తారుమారవ్వడం.. వారిపై ఒక డ్యూయెట్‌ కూడా ఇక్కడ చిత్రీకరించారు.

● 1975లో పసలపూడి, రామచంద్రపురానికి చెందిన నిర్మాతలు కర్రి లచ్చారెడ్డి, నల్లమిల్లి భాస్కరరెడ్డి, చింతా రామకృష్ణారెడ్డి, ఉజూరి వీర్రాజు నిర్మించిన సిరిసిరిమువ్వ సినిమా షూటింగ్‌ కూడా రామచంద్రపురంలోనే చాలా రోజుల పాటు జరిగింది. రాయవరం మండలం పసలపూడితో పాటు కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి, గోకవరం మండలం గుమ్మళ్ల దొడ్డిలోని సత్యనారాయణస్వామి ఆలయాల్లో కూడా ఈ సినిమా సన్నివేశాలు చిత్రించారు. తమ చిన్నతనంలో చంద్రమోహన్‌ తమ ఇంటికి రావడం తనకు ఇప్పటికీ జ్ఞాపకముందని, ఆయన ఎంతో ఉల్లాసంగా గడిపేవారని ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన లచ్చారెడ్డి కుమారుడు సాయిబాబారెడ్డి నాటి క్షణాలను గుర్తు చేసుకున్నారు. సిరిసిరిమువ్వ సినిమా విజయవంతమైన తర్వాత యూనిట్‌ సభ్యులు జిల్లాకు వచ్చిన సందర్భంలో కూడా చంద్రమోహన్‌ పసలపూడి వచ్చారని చెప్పారు. ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ రాజమహేంద్రవరం క్వారీ సెంటర్‌ వద్ద ఉన్న గుడి క్వారీ, సారంగధర కొండ మీద జరిగింది.

● 1983లో పెళ్లిచూపులు, మూడుముళ్లు సినిమాల షూటింగ్‌ సింహభాగం కోనసీమ అందాల నడుమనే జరిగాయి. ఆ సమయంలో హీరో చంద్రమోహన్‌తో పాటు మరికొంత మంది నటులు అమలాపురం మాచిరాజు వీధిలోని కొల్లూరి వారి సత్రంలో రోజుల తరబడి బస చేశారు. అయినవిల్లి మండలం మాగం, ము మ్మిడివరం మండలం అనాతవరం, ఐ.పోలవరం మండలం మురమళ్ల తదితర గ్రామాల్లో మూడుముళ్లు సినిమా సన్నివేశాలు తీశారు. ఈ సినిమా కోసం మాగం ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్య్ర వేడుకల దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో హీరోగా చంద్రమోహన్‌, హీరోయిన్‌గా రాధిక, బాల నటుడిగా ఆలీ తదితరు లు నటించారు. అప్పట్లో – మిగతా 2లోu

కొమ్మ విరిగి.. గాయపడి..

చంద్రమోహన్‌, సుజాత హీరో హీరోయిన్లుగా ప్రణయగీతం సినిమాను 70వ దశకంలో కొత్తపేట ప్రాంతంలోని వెదిరేశ్వరం, కోసూరి నగరం పరిసరాల్లో చిత్రీకరించారు. అప్పట్లో చంద్రమోహన్‌ మాజీ సమితి అధ్యక్షుడు కోసూరి రామకృష్ణంరాజు ఇంట్లో కొన్ని రోజులున్నారు. ఆ సినిమా షూటింగ్‌లో తాడుతో ఉరి వేసుకునే సన్నివేశంలో చెట్టు కొమ్మ విరిగి చంద్రమోహన్‌ స్వల్పంగా గాయపడ్డారు. కొత్తపేట చిన్నంరాజు ఆస్పత్రిలో చికిత్స పొందారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement