
అన్నవరం దేవస్థానం
● విశ్రాంత వ్రత పురోహితులకు
సర్వీసును బట్టి ఏడాదికి
రూ.10 వేల చొప్పున గ్రాట్యుటీ
● ప్రభుత్వం ఉత్తర్వులు
● 33 మందికి
రూ.67.25 లక్షల మేర లబ్ధి
● రేపు పంపిణీ చేయనున్న
మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే పర్వత
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సేవలందించిన 33 మంది విశ్రాంత వ్రత పురోహితులకు వినాయక చవితి పండగ పూట రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గతంలో ఇద్దరు విశ్రాంత పురోహితులకు చెల్లించినట్టుగానే ఈ 33 మందికి కూడా వారి సర్వీసును అనుసరించి ఏడాదికి రూ.10 వేల చొప్పున గ్రాట్యుటీ చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు వీరు గరిష్టంగా రూ.4.5 లక్షలు, కనిష్టంగా రూ.1.5 లక్షల వరకూ గ్రాట్యుటీ పొందనున్నారు. వీరికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మంగళవారం గ్రాట్యుటీ చెక్కులు అందించనున్నారు.
గతంలో రూ.లక్షే..
అన్నవరం దేవస్థానంలో ఏటా సుమారు 7 లక్షల వ్రతాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా ఏటా రూ.35 కోట్లు పైబడి ఆదాయం వస్తోంది. దేవస్థానంలో స్పెషల్‌గ్రేడ్ పురోహితులు 12 మంది, మొదటి తరగతి పురోహితులు 48 మంది, రెండు, మూడు తరగతుల వారు వంద మంది చొప్పున సేవలందిస్తున్నారు. వ్రతాల ఆదాయంలో వీరికి దేవస్థానం 40 శాతం పారితోషికంగా చెల్లిస్తోంది. వీరికి వరుసగా నెలకు రూ.40 వేలు, రూ.37 వేలు, రూ.35 వేలు, మూడో తరగతి వారికి రూ.25 వేల నుంచి రూ.31 వేల వరకూ చెల్లిస్తున్నారు. వీరు 65 సంవత్సరాల తరువాత పదవీ విరమణ చేస్తారు. గతంలో పురోహితులు ఎన్ని సంవత్సరాలు సేవలందించినా వారికి పదవీ విరమణ అనంతరం రూ.లక్ష మాత్రమే గ్రాట్యుటీ చెల్లించేవారు. వ్రత పురోహితులు ముత్య సత్యనారాయణ, ప్రయాగ వేంకట రమణ గత ఏప్రిల్ నెలాఖరున పదవీ విరమణ చేశారు. తాము సుమారు 40 సంవత్సరాల సర్వీసు పూర్తి చేశామని, తమ సర్వీసు ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వానికి వారు అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. దీంత ఆ ఇద్దరికీ సర్వీసు ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు గత జూలైలో వారికి రూ.4.70 లక్షల చొప్పున గ్రాట్యుటీ చెల్లించారు. ఈ ఉత్తర్వులను 2015 నుంచి 2023 వరకూ పదవీ విరమణ చేసిన వ్రత పురోహితులందరికీ కూడా వర్తింపజేయాలని విశ్రాంత పురోహితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.