
పట్టు వదలకుండా పోరాడుదాం
పిఠాపురం: స్వదేశీ సిల్క్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే పేరెన్నికగన్న పట్టు సాగును వదిలి పెట్టేది లేదని పట్టు వదలకుండా అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుందామంటూ పట్టు రైతులు నిర్ణయించుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గురువారం స్థానిక పట్టు పరిశ్రమ కేంద్రంలో నిర్వహించిన పట్టు రైతుల సమావేశంలో పట్టు వదిలేసి పామాయిల్ సాగు చేయండి అన్న ఉన్నతాధికారుల సలహాలపై చర్చించుకున్నారు. రైతులు మాట్లాడుతూ వేలాది మంది రైతులకు జీవనోపాధి, రాష్ట్రంలో పట్టు సాగులో కీలక పాత్ర వహించే చేబ్రోలులో పట్టు సాగు నిలిపివేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇది కేవలం ఒక పంట కాదని ఎందరికో ఉపాధినిచ్చే ఒక పరిశ్రమ అని ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. కొంతకాలంగా ఈ పరిశ్రమ ఇలా దిగజారిపోవడానికి జిల్లా పట్టు పరిశ్రమ శాఖాధికారి గీతారాణి అని, ఆమె పట్టు పరిశ్రమ శాఖ ద్వారా నకిలీ విత్తనాలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే ఆమె పోలీసులతో తమపై దౌర్జన్యం చేయించి రైతులను దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. పంటలు నాశనం అవ్వడానికి ఆమె ప్రధాన కారణమని, ఆమెను తక్షణం బదిలీ చేసి పట్టు పరిశ్రమ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టు సాగు వదిలేసి పామాయిల్ సాగు చేయడం జరగని పని అని అన్నారు. పట్టు సాగులో నష్టాలు రాకుండా ప్రభుత్వం శాస్త్రవేత్తల ద్వారా పరిశోధనలు చేయించి, చర్యలు తీసుకుని పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావాలని రైతులు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను, జిల్లా ఉన్నతాధికారులను కలిసి మళ్లీ విజ్ఞప్తులు చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. పట్టు రైతులు ఉలవకాయల రాంబాబు, ఓరుగంటి సందీప్, ఓరుగంటి శ్రీను, చల్లా రామకృష్ణ, ఎలుగుబంటి బాబు పాల్గొన్నారు.
చేబ్రోలులో పట్టు రైతుల సమావేశం