బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

May 23 2025 2:29 AM | Updated on May 23 2025 2:29 AM

బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

గోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో బావి నుంచి గుర్తుతెలియని పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రామాలయం వద్ద ఉన్న చెరువు మధ్యలో ఉన్న బావిలో గురువారం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు వయసు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, లుంగీ ధరించి ఉన్నాడని, మృతదేహం ఉన్న తీరుని బట్టి చనిపోయి సుమారు 15 రోజులు అయ్యి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించామని, వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

కె.గంగవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

కులం పేరుతో దూషించారంటూ నిరసన

కె.గంగవరం: స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోట గ్రామంలో దళిత కాలనీకి చెందిన మహిళలు, పురుషులు భారీగా స్టేషన్‌ వద్దకు తరలివచ్చి కులం పేరుతో దూషించి మహిళలపై దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కోట గ్రామానికి చెందిన కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్య ఈశ్వరరావు మోటారు సైకిల్‌పై ఏటిగట్టు వైపు వెళుతున్న సమయంలో అటుగా రోడ్డపై వస్తున్న ఉపాధి కూలీలకు మోటారు సైకిల్‌ హ్యాండిల్‌ తగిలింది. వెంటనే కూలీలు అతనిని ఆపి ప్రశ్నిస్తున్న సమయంలో ఈశ్వరరావు మహిళా కూలీలను కులం పేరుతో దూషించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో వారు ఈశ్వరరావును స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు చేశారు. ఈశ్వరరావు కూడా రోడ్డుపై వెళ్తున్న తనను అడ్డుకుని దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

స్టేషన్‌ వద్ద నిరసన..

కోట గ్రామానికి చెందిన పలువురు వాహనాలలో భారీగా స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. కులం పేరుతో దూషించి మహిళలను దాడి చేసిన ఈశ్వరరావును వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలంటూ కొంత సేపు నిరసన చేశారు. ఈశ్వరరావు గతంలో కూడా దళితులను చిన్నచూపు చూశాడని, తమ కాలనీలో గల చెరువును తవ్వనీయకుండా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పారు. చెరువు లేకపోతే మాకు నీరు ఉండదని లంక భూములు సాగు చేసుకునే విషయంలో కూడా అడ్డుకుంటున్నాడని వారు నిరసన చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement