రాజోళి: ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మంగళవారం ఆయన రాజోళితోపాటు తుమ్మిళ్ల గ్రామంలో పర్యటించారు. ముందుగా రాజోళి పీహెచ్‌సీని తనిఖీ చేసి.. మందులు, రిజిష్ట్రర్‌ను పరిశీలించారు. రోగుల సంఖ్య తక్కువగా ఉందని, వైద్య సిబ్బంది ఇంతకు సేవలు అందిస్తున్నారా.. లేదా.. అని అడిగి తెలుసుకున్నారు. రిజిష్ట్రర్ నమోదుపై అసహనం వ్యక్తం చేశారు. విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బంది రంజిత్‌కుమార్, కిష్టమ్మకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలకు అందించకపోతే ఎలా అని నిలదీశారు. నెలరోజుల్లోగా పనితీరు మార్చుకుని, మెరుగైన సేవలు అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కేజీబీవీని సందర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంకా విద్యార్థులు రాకపోవడం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు. అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులకు కూడా భోజన సదుపాయం కల్పించాలని సూచించారు. పాఠశాల భవనంలో నెలకొన్న సమస్యలపై అధికారులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యేలోగా డ్రెయినేజీ, ఇతర వసతుల పనులు పూర్తిచేయాలని చెప్పారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌పై అధికారులతో మాట్లాడి, ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని, బీఎల్‌ఓలకు ప్రత్యేకంగా సూచనలు అందించాలని తెలిపారు. మండలంలోని తుమ్మిళ్లలో టీజీఎండీసీ ద్వారా నడుస్తున్న ఇసుక తోడివేతను పరిశీలించారు. నిబంధనల మేరకు ఇసుక రవాణా చేయాలని, అక్రమంగా తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇసుక రీచ్ దగ్గర సీసీ కెమెరాలు నిత్యం పర్యవేక్షణ చేయాలని, మైనింగ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డీఎం చంద్రమౌళి, తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ సయ్యద్ ఖాన్, ఎస్‌ఐ గోకారి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో ముందంజ
గద్వాల: జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించడంతోపాటు వందశాతం పూర్తిచేసి రాష్ట్రంలోనే ముందంజలో నిలిచామని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. తనతోపాటు అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికార యంత్రాంగం ఆయా కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించడంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టామన్నారు. జిల్లావ్యాప్తంగా 76 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. రూ.121.18 కోట్ల విలువైన 50,725 మె.ట., ధాన్యం సేకరించామన్నారు. ఇందుకు సంబంధించి రైతులకు ఇప్పటికే డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు.


