గద్వాల: అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. ఆదివారం దివంగత ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు బాబు జగ్జీవన్‌రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల కేంద్రమంత్రిగా పనిచేసిన జగ్జీవన్‌రామ్ దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. విద్యాపరంగా వెనకబడిన జిల్లాలో విద్యార్థులు మధ్యలోనే బడి మానేసి పరిస్థితులను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. సెన్సెక్స్‌కు సంబంధించి మే మొదటి వారం నుంచి ఇళ్ల గణన చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనగణన చేసే నాటికి జిల్లా అక్షరాస్యతలో మెరుగుపడేలా అన్ని సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. అదే విధంగా బాల్యవివాహాలు జరగకుండా అరికట్టాలన్నారు. ఇటీవల జిల్లాలో పోక్సో కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. చిన్నారులపై అఘాయిత్యాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎక్కడైనా అంటరానితనం ఉన్నట్లు తెలిస్తే విజిలెన్స్ కమిటీ ద్వారా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ నూతన విగ్రహం ఏర్పాటు, అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఇండోర్ స్టేడియం వద్ద ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో నెలకొన్న సామాజిక సమస్యలను పారద్రోలేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అంతకుముందు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ పాటలతో అలరించారు. అదే విధంగా ఐడీఓసీ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషిత, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి అక్బర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్‌రామ్
విగ్రహానికి
నివాళులర్పిస్తున్న కలెక్టర్
రిజ్వాన్‌బాషా షేక్,
ఎస్పీ శ్రీనివాసరావు


