బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత
గద్వాల: బాల్య వివాహాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బాల్య వివాహ ముక్త్‌భారత్ వందరోజుల కార్యక్రమంలో భాగంగా రూపొందించిన రథయాత్ర వాహనాన్ని బుధవారం ఆయన కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా నేటికీ బాల్యవివాహాలు జరుగుతుండటం బాధాకరమన్నారు. జిల్లాలో అధికంగా గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో జరుగుతున్నాయని.. వీటి నియంత్రణకు ప్రజలందరు సామాజిక బాధ్యతతో ముందుకెళ్లాలని కోరారు. 18 ఏళ్లలోపు అమ్మాయిలకు వివాహం చేయడంతో చదువుతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని.. చిన్న వయసులో గర్భం దాల్చడంతో అనేక సమస్యలు తలెత్తుతాయని వివరించారు. బాల్య వివాహాలతో తలెత్తే అనర్థాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2030 నాటికి దేశంలో ఎక్కడా బాల్యవివాహాలు జరగకుండా పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం రథయాత్ర ముఖ్య ఉద్ధేశమన్నారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్, డీడబ్ల్యూఓ సునంద, జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, డీసీపీఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


