ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర
అలంపూర్: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని మార్చే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరామ్ నాయక్ ఆరోపించారు. అలంపూర్ చౌరస్తాలోని జాతీయ రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని ఒక పథకంగా మార్చే ప్రయత్నం చేస్తుందని, పేదలకు పనిదినాలు వేతనాన్ని పెంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉండగా అందుకు భిన్నంగా పేరు మార్చి పనిదినాలు తగ్గించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం అన్యాయమన్నారు. దేశంలో మౌళిక వసతుల కల్పనలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ... ఉపాధిహామీ పథకం వచ్చిన సమయంలో వంద శాతం నిధులు కేంద్రమే భరించాలనే నిబంధన ఉందన్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్రాలు భరించాలని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీలో నిధుల కోత విధించి కూలీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రాలపై భారాన్ని వేసి కేంద్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందన్నారు. ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని, ఉపాధి హక్కులను కాపాడుకోవడానికి ప్రజలు ఐక్యంగా ఉద్యమించడానికి సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు రేపల్లె దేవదాసు, పరం జ్యోతి మద్దిలేటి, రాజు, వీవీ నరసింహ్మా, ఉప్పేర్ నరసింహ్మా, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, రఫీ, నరసింహ్మ, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.


