సర్వం సిద్ధం..
అలంపూర్: పంచాయతీ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరింది. మరికొన్ని గంటల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్‌ను నిర్దేశించే పోలింగ్ ప్రారంభం కానుంది. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లో బుధవారం ఎన్నికల పోలింగ్ జరనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రితో అధికారులు, సిబ్బంది మంగళవారమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవిష్యత్‌ను తేల్చడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు.
మూడో విడత ఇలా..
మూడో విడతలో మొత్తం 75 సర్పంచ్, 700 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మానవపాడు మండలంలోని గోకులపాడు, చెన్నిపాడు, చంద్రశేఖర్‌నగర్, చండూరు సర్పంచ్ స్థానాలతో పాటు 50 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇటిక్యాల మండలంలో వావిలాల, మొగలిరావులచెరువు సర్పంచ్ స్థానాలు, 43 వార్డులు, ఎర్రవల్లి మండలంలో రాజశ్రీ గార్లపాడు సర్పంచ్ స్థానంతో పాటు 23 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. అలంపూర్ మండలంలో 6 వార్డులు, ఉండవెల్లిలో 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఉండవెల్లి మండలంలోని బస్వాపురంలో 1, 5, 6 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. ఆయా వార్డులకు ఇద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేసినా వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఇక మిగిలిన 68 సర్పంచ్, 561 వార్డు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
● మూడో విడత ఎన్నికలు జరిగే జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 216 మంది, వార్డు స్థానా ల్లో 1,287 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 638 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 1,430 మంది అధికారులు పోలింగ్ విధులకు నియమించారు. 1,00,372 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నువ్వా..నేనా అన్నట్టుగా బరిలో ని లిచిన అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలిపోనుంది.
నేడు ఐదు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు
68 సర్పంచ్, 561 వార్డు స్థానాల్లో పోలింగ్
638 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు


