తుది విడతకు కట్టుదిట్టమైన భద్రత
అలంపూర్: జిల్లాలో జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఎర్రవల్లి మండలం పదో బెటాలియన్‌లో మంగళవారం మూడో విడత ఎన్నికల విధులపై నిర్వహించిన సమగ్ర సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మూడో విడత ఎన్నికలు జరిగే 68 జీపీల్లో 28 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కోసం 370 మంది పోలీస్ ఫోర్స్, 20 రూట్ మొబైల్ పార్టీలు, 6 స్ట్రైకింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 6 క్యూఆర్‌టీలు, 14 మందితో రూట్ ఇన్‌చార్జీలను నియమించినట్లు వివరించారు. ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకావొద్దన్నారు. ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, మద్యం, డబ్బు పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా చిన్నపాటి గొడవలను కూడా నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవి తదితరులు ఉన్నారు.
● అలంపూర్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఉండవెల్లిలో పోలీసు విధుల నిర్వహణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.


