పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి
అలంపూర్: మూడో విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తమకు ఇచ్చే పోలింగ్ సామగ్రిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు. ఏమైనా పొరపాట్లు జరిగితే రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పోలింగ్, కౌటింగ్ నిర్వహణకు అవసరమైన ప్రతి సామగ్రి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు కేంద్రాల్లో రిపోర్టు చేసిన తర్వాత రూట్ల వారీగా జోనల్ అధికారులు సహకారం అందిస్తారన్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన పీఓలు, ఓపీఓలు, ఇతర అధికారులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత రిసెప్షన్ సెంటర్లకు తిరిగి వచ్చే వరకు పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చివరి దశ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు నుషిత, నరేశ్ ఉన్నారు.


