సరిహద్దులు అప్రమత్తమేనా..?
● ఎన్నికల వేళ మద్యం బార్డర్లు దాటే అవకాశం
● అక్రమ మద్యానికి దారులు
వెతుకుతున్న దందారాయుళ్లు
● ఇప్పటికే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు
ఏపీ మద్యం..?
ప్రస్తుతం ఏపీలో కొన్ని రకాల మద్యం బాటిళ్లు తక్కువ ధరకే వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అక్కడి ప్రభుత్వం తక్కువ ధరకే చీప్ లిక్కర్‌ను అందుబాటులో ఉంచింది. కాని దాన్ని ఏపీలో మద్యం ప్రియులు కూడా తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి లిక్కర్ వ్యాపారులు, జిల్లాలోని కొందరితో కుమ్మకై ్క నది మార్గం ద్వారా ఆ మద్యాన్ని జిల్లాలోకి పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రూ.110 కే చీప్ లిక్కర్ క్వాటర్‌ను ఇస్తుండగా, అందులో పలు రకాల బ్రాండ్లను అక్కడి ప్రభుత్వం మద్యం ప్రియులపైకి నెట్టింది. దాన్నే పేరు మార్చి కాని, బాటిళ్లను మార్చికాని జిల్లాలోకి పంపే అవకాశాలు ఉన్నాయని, తుంగభద్ర నది అవతల ఉన్న కర్నూల్ జిల్లాని ఆయా గ్రామాల నుంచి నది ఇవతలి వైపున ఉన్న జిల్లాలోకి రాకుండా మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
కఠిన చర్యలు
ఇప్పటికే చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో విధిగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. పక్కా సమాచారం ఇచ్చే వాళ్లతో టచ్‌లో ఉంటున్నాం. చెక్‌పోస్ట్ సిబ్బందితో పాటు, గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నజర్ పెట్టాం. చిన్న అనుమానం వచ్చినా వదిలేది లేదు. అక్రమ మద్యం రవాణా చేసేవారిపై, గతంలో దందా చేసిన వారి కదలికలపై నిఘా ఉంచాం. దందాలు చేస్తే జైలు శిక్ష తప్పదు.
– టాటాబాబు, సీఐ
రాజోళి: ఎన్నికల వేళ అక్రమ దందా రాయుళ్లు వారి వ్యాపారం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నారు. గ్రామ పంచాయతీలు ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఇప్పటికే హడావుడి మొదలైంది. కాగా ఓటర్ల నుంచి ఓట్లు రాబట్టుకునేందుకు కొన్ని చోట్ల ప్రలోభాలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే. అందులో ప్రధానంగా మద్యం పంపిణీ ఎక్కువగా జరిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో గ్రామాల్లో ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు. అయినప్పటికీ, పోటీలో నిలిచేవారు, అక్రమ మద్యం తెచ్చే వారితో కలిసి గ్రామాల్లో మద్యం సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకించి నదీ పరివాహక గ్రామాల్లో దందాకు ముమ్మరంగా ప్రణాళికలు చేస్తున్నారని తెలుస్తుంది. జిల్లాలో ఉన్న మద్యంతో పాటుగా తక్కువ ధరకు లభించే మధ్య, చిన్న సైజు పాకెట్లలో లభించే మద్యంపై ఫోకస్ పెట్టారు. దీని కోసం కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు తదితర పట్టణాల నుంచి కొన్ని రకాల మందు బాటిళ్లు తెచ్చే అవకాశాలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా అక్కడి నుంచి మద్యం పెద్ద ఎత్తున రవాణా జరిగింది. ఇదే తరహాలో మళ్లీ మద్యం రవాణా చేసేందుకు ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం.
నదీ తీర గ్రామాల్లో...
కర్ణాటక నుంచి మద్యం తీసుకురావడానికి కట్టుదిట్టమైన పోలీస్ చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ, ఆర్‌డీఎస్ కెనాల్ మీదుగా, ఇతర అడ్డదారుల్లో మద్యం తీసుకువచ్చేందుకు మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం. గతంలో మాదిరిగానే కర్ణాటకలో కొన్ని ప్రత్యేక టెట్రా పాకెట్లల్లో లభించే మద్యం, 90 ఎంఎల్ ప్యాకెట్లు, గోవా నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చే మద్యాన్ని గ్రామాల్లోకి తరలించేందుకు రాజోళి మండలంలోని తుమ్మిళ్ల, ముండ్లదిన్నె గ్రామాలకు చెందిన వ్యక్తులు, అయిజ, రాయచూరు, గట్టు మండలంలోని పలువురితోపాటు ఏపీలోకి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల వారితో ఒప్పందాలు చేసుకున్నారని సమాచారం. కాగా రాజోళి పోలీస్‌స్టేషన్ పరిదిలోని సుంకేసుల డ్యాం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్రమ మద్యంతో పాటు, ఎన్నికల సందర్భంగా డబ్బు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వాటి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో రోడ్డు మార్గంలో ఏపీ వ్యక్తులు అక్రమ మద్యాన్ని తెలంగాణలోకి తెచ్చే అవకాశం లేదు, కాని నదీ తీర గ్రామాల్లో పుట్టీల ద్వారా అక్రమ మద్యం వ్యాపారం యథేచ్ఛగా నడిచిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో కర్ణాటక నుంచి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లోకి మద్యం చేర్చుకుని, అక్కడి నుండి నది ఇవతలి వైపున ఉన్న జిల్లాలోని పలు గ్రామాలకు మద్యం చేరవేసేందుకు అవకాశాలున్నాయని ఆయా గ్రామాల్లోని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల పుణ్యమా అని కల్లీ మద్యం తెచ్చి ప్రజలకు ఇస్తే దాని వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటని అంటున్నారు.


