గ్రామాల్లో రసవత్తర పోరు
● గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టిన అభ్యర్థులు
● పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ.. ఉనికి చాటేందుకు పార్టీల పాట్లు
● ఊపందుకున్న ప్రచార సందడి
గద్వాలటౌన్: పంచాయతీ ఎన్నికలను గద్వాల నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీ రహిత ఎన్నికలైనప్పటికి రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు అనేక పాట్లు పడుతున్నాయి. రాబోయే మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడే సర్పంచులను తమ తమ వాళ్లుగా అనిపించుకోవాలని ఉద్దేశ్యంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. మరో వైపు సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల పోటాపోటీని దృష్టిలో పెట్టుకుని అర్ధబలం, అంగబలం కోసం పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా పార్టీల నాయకులు కూడా తమదైన ముద్ర వేసేందుకు గ్రామాల్లో పడరాని పాట్లు పడుతున్నారు.
ఊపందుకున్న ప్రచారం..
మొదటి, రెండవ విడత ఎన్నికల వేడి రాజుకుంది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారవటంతో ప్రచార పర్వం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.. సర్పంచ్‌గా గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న ఒక్కో అభ్యర్థి ఒక్కో పంథా అవలంభిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు సామాజిక మాధ్యమాలను విరివిరిగా వినియోగించుకుంటే.. మరి కొందరు ‘ నేను ఇవి చేసి చూపిస్తా’నంటూ బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడవ విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో అక్కడ కూడా పల్లెపోరు రసవత్తరంగా మారింది. స్థానిక వర్గాలు, సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత పలుకుబడి కీలకంగా మారనున్నాయి.
ప్రలోభాల పర్వం
కుల సంఘాలు, వార్డు సమూహాలు, పెద్ద కుటుంబాలకు ప్రత్యేక విందులు ఏర్పాటు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందురోజు ఓటుకు కొంత నగదు ఇవ్వటం ద్వారా ఓట్లు కొల్లగొట్టేందుకు నిధులు సమకూర్చుకుంటున్నారు. యువతను ఆకట్టుకునేందుకు రాత్రిపూట మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.


