ఆదిశిలా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
మల్దకల్: ఆదిశిలాక్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. గురువారం అర్ధరాత్రి కనులపండువగా రథోత్సవం నిర్వహించగా.. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నెల రోజులపాటు స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. వాహనాలు, ఎడ్లబండ్లపై ఆలయానికి భక్తులు చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులుతీరి కనిపించారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అశ్వవాహనంపై ఊరేగింపు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారు అశ్వవాహనంపై ఊరేగారు. ముందుగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, ధీరేంద్రదాసుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీసమేతుడైన శ్రీనివాసుడిని అశ్వవాహనంపై ఉంచి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, బాబురావు, పూజారులు పాల్గొన్నారు.
ఆదిశిలా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ఆదిశిలా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ఆదిశిలా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు


