పోలింగ్ నిర్వహణపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న కలెక్టర్ సంతోష్
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ బూత్‌లో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమేనన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఓటర్లు తమ ఓటు గల్లంతైందని, ఇతర సమస్యలు చెప్పకుండా ముందుగానే పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ముందుగానే మాస్టర్ ట్రైనర్స్‌ను అడిగి పరిష్కరించుకోవాలన్నారు. ఈ శిక్షణలో బ్యాలెట్ బాక్స్‌లను తెప్పించి మాదిరి పోలింగ్ కూడా చేస్తారన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఓటు హక్కు ఉంటే ఫామ్ 14 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ దరఖాస్తులను పూరించి సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేస్తే ఈ నెల 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం తమ జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ, ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


