ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
గద్వాలటౌన్: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని డీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు పోటీలను నిర్వహించారు. అనంతరం డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులు అపారమైన ప్రతిభ కలిగి ఉంటారన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. వైకల్యం శరీరానికే కాని, మనసుకు కాదని, సకలాంగులతో సమానమేనన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా విలీన విద్య సమన్వయ అధికారి హంపయ్య, ఐఈఆర్‌పీలు వాసు, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
గద్వాలటౌన్: వసతిగృహా విద్యార్థులకు రుచితో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలోని వంటగది, స్టోర్ రూంను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాన్ని చక్కగా నిర్వహిస్తుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువులో రాణించి వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లాలో ఇటీవల కొన్ని వసతి గృహాల్లో ఆహారం కలుషితమై విద్యార్థులు కొందరు అస్వస్థతకు గురైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అలాంటివి పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి


