క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు స్వీకరించాలి
ఎర్రవల్లి: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆయా పంచాయతీలకు ఖరారు చేసిన రిజర్వేషన్లను క్షుణ్ణంగా సరిచూసుకొని పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన క్లస్టర్–1, క్లస్టర్–2 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. వివిధ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తుండటంతో ఆయా పంచాయతీల ఓటర్ లిస్టును పరిశీలించారు. పోటీ చేసే అభ్యర్థులు, పూరించాల్సిన వివిధ దరఖాస్తులు, నామినేషన్ వేసేందుకు అవసరమైన ఇతర సామగ్రిని రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే వారికి తగిన సహకారం అందించాలని హెల్ప్‌డెస్క్ సిబ్బందికి సూచించారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీచేసే అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపరచాల్సిన వయస్సు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు పెండింగ్‌లో ఉండకుండా కట్టించుకోవాలని, నామినేషన్ల డిపాజిట్ స్వీకరించాక అభ్యర్థులకు రషీదు అందజేయాలన్నారు. తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్‌ఖాన్, తదితరులు ఉన్నారు.


