దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
గద్వాలటౌన్: దివ్యాంగులు తమ వైకల్యాన్ని శాపంగా భావించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబాటుతనం, పేదరికం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల అనేకమంది దివ్యాంగులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చాయని, సద్వినియోగం చేసుకోవాలని, దివ్యాంగుల హక్కులను కాపాడేందుకు ఉన్న చట్టాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు మాట్లాడుతూ డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో మహిళా దివ్యాంగ సంఘాలు ఏర్పాటు చేసి, వారికి ఉపాధి నిమిత్తం ప్రత్యేక రుణాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకొని అన్నిరంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులను అందజేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని దివ్యాంగులు అడిషనల్ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి సునంద, డీఈఓ విజయలక్ష్మి, డీవైఎస్‌ఓ కృష్ణయ్య, డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాసులు, డీసీపీఓ నర్సింహా, న్యాయవాదులు శ్రీనివాసులు, లక్ష్మణ్‌స్వామి, దివ్యాంగుల సేవా సంఘం నాయకులు చంటిబాబు, బీసమ్మ, లక్ష్మీకాంతరెడ్డి, నర్సింహులు, ఆంజనేయులు పాల్గొన్నారు.


