15 జీపీలు ఏకగ్రీవం
ఏకగ్రీవమైన సర్పంచులు వీరే..
● ఊపిరి పీల్చుకున్న పార్టీలు
● సమరానికి సిద్ధమైన అభ్యర్థులు
గద్వాలటౌన్: పంచాయతీ తొలిదశ ఎన్నికలలో పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. తొలిదశ ఎన్నికలు జరిగే గద్వాల, గట్టు, కేటీదొడ్డి, ధరూరు మండలాల్లోని 106 గ్రామ పంచాయతీలకుగాను 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన సర్పంచులలో ఒకరు మినహా మిగిలిన సర్పంచులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కావడం విశేషం. గట్టు మండలంలో 6 గ్రామ పంచాయతీలు, కేటీదొడ్డి మండలంలో 2, ధరూరు మండలంలో , గద్వాల మండలంలో 3 గ్రామ పంచాయతీలలో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో వాటిని అధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అయితే ఏకగ్రీవమైన సర్పంచు అభ్యర్థులకు, వార్డు సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదు. గురువారం అందజేస్తామని అధికారులు తెలిపారు.
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
తొలిదశ పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న జరగనుండగా.. సర్పంచు, వార్డు సభ్యులకు వేర్వేరుగా కేటాయించే గుర్తులను అధికారులు ప్రకటించారు. ఎన్నికల సంఘం నుంచి పంచాయతీ అధికారులకు వచ్చిన ఉత్తర్వుల మేరకు గుర్తులను కేటాయించారు. రాజకీయ పార్టీల రహితంగా ఎన్నికలు జరుగుతుండటంతో పోటీ చేసే అభ్యర్థులకు పలు రకాల గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. పోటీలో నిలిచే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఇబ్బంది కలగకుండా 10–15 రకాల గుర్తులను కేటాయిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ గుర్తులతో కూడిన వివరాలు అన్ని గ్రామ పంచాయతీలకు చేరాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే పోటీలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు అధికారికంగా గుర్తులను కేటాయించారు.
ఫలించిన ప్రయత్రాలు..
జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం ప్రధాన పార్టీల మద్దతుదారులను భయపెట్టిన రెబల్స్‌తో పాటు కొంతమంది ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు పోటీ నుంచి పక్కకు తప్పుకున్నారు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఽనామినేషన్ల ఉపసంహరణ అనంతరం తొలిదశలోని గట్టు, ధరూరు, కేటీదొడ్డి, గద్వాల మండలాల్లోని 106 గ్రామ పంచాయతీ సర్పంచులకు గాను 714 మంది అభ్యర్థులు, 974 వార్డు సభ్యులకు 1903 మంది మద్దతుదారులు ఎన్నికల బరిలో మిగిలారు. ఏకగ్రీవమైన పంచాయతీలలో 14 మంది ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ మద్దతుదారులే ఉండటం విశేషం. ఒక్కరు మాత్రమే బీజేపీ మద్దతుదారులు ఉన్నారు. ప్రతి మండలంలో రెండు, మూడు పంచాయతీలు తప్పిస్తే మిగిలిన అన్ని పంచాయతీలలో ద్విముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీల మద్దతుదారులు తిరుగుబాటుదారులను, ఎంతో కొంత ఓట్లు చీల్చగల రెబల్స్‌ను తమకు అనుకూలంగా పోటీ నుంచి తప్పించేలా గత రెండురోజుల నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పలుచోట్ల బెదిరింపులు, హెచ్చరికలు, నజరానాలతోనే అధికార పార్టీ మద్దతుదారులు తమ పార్టీ రెబల్స్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను సైతం పోటీ నుంచి తప్పించారు. మొదటి దశ గ్రామ పంచాయతీలలో ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణలో ఆయా ఎన్నికల నామినేషన్ కేంద్రాలు నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి.
గద్వాల మండలం కుర్వపల్లి సర్పంచ్‌గా సరస్వతి, ఈడిగోనిపల్లిలో రాణి, ముల్కలపల్లిలో బోయ రాముడు ఏకగ్రీవమయ్యారు.
ధరూరు మండలం ర్యాలంపాడు సర్పంచ్‌గా వెంకట్రామిరెడ్డి, జాంపల్లిలో శారదమ్మ, ద్యాగదొడ్డిలో సావిత్రమ్మ, చిన్నపాడులో సవారన్న సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
కేటీదొడ్డి మండలం చింతలకుంట సర్పంచ్‌గా రాజశేఖర్, రంగాపురం సర్పంచ్‌గా పెద్ద జయన్న ఎన్నికయ్యారు.
గట్టు మండలం ముచ్చోనిపల్లి సర్పంచ్‌గా పార్వతమ్మ, అరగిద్దలో బాలక్రిష్ణనాయుడు, లింగాపురంలో షకుంతల, పెంచికలపాడులో కుర్వ ఆంజనేయులు, తుమ్మలపల్లిలో గోవిందమ్మ, తారాపురంలో లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


