మూడో విడత నామినేషన్లు షురూ..
● ఐదు మండలాల్లో 75 పంచాయతీలు, 700 వార్డులు
● మొదటి రోజు సర్పంచ్‌కు 39, వార్డులకు 49 వార్డులకు నామినేషన్లు
అలంపూర్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ఆరంభించారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటి రోజు సర్పంచ్ స్థానానికి 39 మంది అభ్యర్ధులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అదేవిధంగా వార్డులకు 49 మంది అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. మూడవ విడతలోని 5 మండలాల్లో 75 పంచాయతీలకు, 700 వార్డులకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. మొదటి రోజు కావడంతో ఇంకా నామినేషన్లు అంతంత మాత్రంగానే దాఖలు చేశారు. చివరి రెండు రోజులు గురు, శుక్రవారాలు కావడంతో అభ్యర్థులు తమ నామినేషన్లు అధిక సంఖ్యలో దాఖలు చేసే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నామినేషన్ కేంద్రం పరిశీలన
అలంపూర్ మండలంలోని బుక్కాపురం, భీమవరం, క్యాతూర్, అలంపూర్ పట్టణంలోని నామినేషన్ కేంద్రాలను డిప్యూటీ కలెక్టర్ రాజ్‌కుమార్ పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులతో నామినేషన్ దాఖలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ మంజుల నామినేషన్ దాఖలు కేంద్రాలను పరిశీలించారు.
మూడో విడత నామినేషన్ల వివరాలిలా..
మండలం మొత్తం వార్డులు సర్పంచ్ వార్డులు
పంచాయతీలు నామినేషన్లు
అలంపూర్ 14 120 10 13
ఉండవల్లి 15 142 5 4
మానవపాడు 17 164 4 ––
ఇటిక్యాల 14 130 6 12
ఎర్రవల్లి 15 144 14 20


