ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి
● 974 పోలింగ్ కేంద్రాలకు..
974 మంది ఓపీఓలు, 1236 సిబ్బంది
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు గంగాధర్‌తో కలిసి తొలి విడత పోలింగ్ సిబ్బందిని రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాలలో నిర్వహించనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 974 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో విధులు నిర్వర్తించడానికి పీఓలు 974, ఓపీఓలు 1,236 సిబ్బందిని రెండవ ర్యాడమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఒక్కో మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ అధికారులను ర్యాండమైజేషన్ విధానంలో కేటాయించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు పారదర్శకంగా ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ వినియోగిస్తూ ఆన్‌లైన్‌లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీకాంత్, జడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఈడీఎం శివ తదితరులు పాల్గొన్నారు.


