కల్యాణ వైభోగమే..
● కనులపండువగా లక్ష్మీవేంకటేశ్వరుడి కల్యాణ మహోత్సవం
● జనసంద్రంగా మారిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తజనం నడుమ స్వామివారి కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. ముందుగా సింగిల్‌విండో చైర్మన్ తిమ్మారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించగా.. వేద పండితులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చూడముచ్చటగా అలంకరించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, భాజా భజంత్రీలు, మేళతాళాల మధ్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆదిశిలా వాసుడైన శ్రీనివాసుడు శ్రీదేవి, భూదేవి మెడలో మాంగళ్యధారణ చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు.
గజవాహనంపై ఊరేగిన ఆదిశిలా వాసుడు
ఆదిశిలా వాసుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీవేంకటేశ్వస్వామిని గజవాహనంపై ఊరేగించారు. వేదపండితులు ప్రసన్నాచారి, భీంసేనాచారి, రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, ధీరేంద్రదాసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. లక్ష్మీ సమేతుడైన శ్రీనివాసుడిని గజవాహనంపై కొలువుదీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
కల్యాణ వైభోగమే..


