నామినేషన్లలో డిక్లరేషన్ తప్పనిసరి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. శుక్రవారం గద్వాల మండలం శెట్టిఆత్మకూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆత్మకూర్, గోనుపాడు, సంగాల, మదనపల్లి, ఈడిగోనిపల్లి పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను ప్రక్రియ, ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఎన్నికల ఖర్చుల లెక్కల నిర్వహణపై అభ్యర్థి దాఖలు చేయాల్సిన డిక్లరేషన్ ఫారాలపై అన్ని అంశాలను తప్పనిసరిగా రాసేలా అవగాహన కల్పించాలన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వారి వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. హెల్ప్ డెస్కు వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కలెక్టర్ తగు సూచనలు చేశారు. నామినేషన్ల డిపాజిట్‌ను స్వీకరించిన వెంటనే రషీదు అందజేయాలన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు ప్రతిపాదించే ఇద్దరినీ మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు. సాయంత్రం అయిదు గంటలలోపు నామినేషన్ వేసేందుకు కేంద్రంలోకి వచ్చిన అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల జనరల్ పరిశీలకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళి పక్కాగా అమలు
గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి స్వీకరించే నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. శుక్రవారం గద్వాల మండలం పరుమాల కేంద్రంలోని ఆయా గ్రామాల నామినేషన్ల ప్రక్రియతో పాటు ఆయా పంచాయతీలలో ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపర్చాల్సిన వయసు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియామళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


