అమరవీరుల త్యాగం మరువలేనిది
గద్వాల క్రైం: పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులకు పోలీసుల విధులు, ఆయుధాల పనితీరు, బాంబ్ స్క్వాడ్, జాగీలాలు, మరణాయుధాలను గుర్తించే పరికరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తోందన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేస్తున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు.


