ముగిసిన బ్రహ్మోత్సవాలు
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున స్వామివారి సన్నిధిలో మహా పూర్ణాహుతి, శ్రీచక్రస్నానం, ధ్వజా అవరోహణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
గద్వాలటౌన్: చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బుర్థపేట ప్రభుత్వ పాఠశాలతో పాటు మండలంలోని శెట్టి ఆత్మకూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ప్రణాళికా బద్ధంగా చదువుకొని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్‌తో పాటు పాఠశాల ఆవరణలో కూరగాయల సాగును పరిశీలించారు. పాఠశాలలోని వంటగది, తాగునీరు, భోజనం నాణ్యత, స్టోర్ రూంలో సరుకులు, పరిసరాలను చూశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. డీఈఓ వెంట జిల్లా సమన్వయ అధికారి హంపయ్య, హెచ్‌ఎంలు నర్సింహారెడ్డి, సునీత, చాంద్‌పాషా ఉన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.5,801
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 273 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 5,801, కనిష్టంగా రూ. 2,229, సరాసరి రూ. 4100 ధరలు లభించాయి. అదే విధంగా 112 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 5,921 కనిష్టంగా రూ. 4,119, సరాసరి రూ. 5,829 ధరలు వచ్చాయి. 21 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) విక్రయానికి రాగా.. రూ. 1,903 ధర పలికింది.
ముగిసిన బ్రహ్మోత్సవాలు


