
ధర్మస్థాపనకు నడుం బిగించాలి
గద్వాలటౌన్: సమాజాన్ని జాగృతం చేయడానికి, హిందువుల్లో సంఘటిత శక్తిని పెంపొందించేందుకు ప్రతి స్వయం సేవకుడు నిరంతరం కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో పద సంచాలన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు స్వయం సేవకులనుద్దేశించి మాట్లాడారు. దేశ హితం కోసమే ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తుందని.. ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడమే లక్ష్యమన్నారు. ధర్మస్థాపనకు ప్రతి హిందువు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. స్వయం సేవకులు ఎంతో మంది అంకితభావంతో పనిచేసి ఆత్మబలిదానాలు చేసుకున్నారని.. వారి విజయగాదలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం హిందుత్వాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. మారుమూల గ్రామాలు, వార్డుల్లోనూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. రాబోవు రోజుల్లో హిందూ జనజాగరణ, హిందూ సమ్మేళనాలు కొనసాగుతాయని తెలిపారు. అంతకుముందు పట్టణ పురవీధుల్లో ఆర్‌ఎస్‌ఎస్ కవాతు (పద సంచాలన్) నిర్వహించారు. ఈ సందర్భంగా నమస్తే సదావత్సలే మాతృభూమే, జై శ్రీరామ్.. భారత్ మాతకీ జై అంటూ స్వయం సేవకులు నినాదాలతో మార్మోగించారు. పద సంచాలన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలతో పాటు బీజేపీ, హిందూ ధార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.