
ఇంటింటా వెలుగుల దీపావళి
గద్వాలటౌన్: జిల్లావ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. సోమ, మంగళవారం భక్తిశ్రద్ధలతో లక్ష్మీపూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా వాణిజ్య, వ్యాపార దుకాణాలతో పాటు నివాసగృహాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇంటిల్లిపాది వివిధ ఆకృతుల్లో దీపాలను వెలగించి పూలతో అందంగా అలంకరించి.. లక్ష్మీదేవి పూజలు చేశారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే ఈ పండుగను కుటుంబ సమేతంగా ఎంతో ఆనందంగా నిర్వహించుకున్నారు. వ్యాపారవేత్తలు పాత ఖాతాలు మూసేసి, కొత్త పుస్తకాలు తెరిచారు. వ్యాపార దుకాణాల్లో కుటుంబ సమేతంగా లక్ష్మీపూజలు చేశారు. కొత్తగా కొనుగోలుచేసిన వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సారి రెండు రోజులపాటు దీపావళి సంబరాలను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు టపాసుల మోతలతో విధులన్నీ మార్మోగాయి. ఇటీవల మరింత ఆధునికతతో రూపొందించిన బాణసంచా కాల్చుతూ చిన్నా, పెద్ద సంబరాలు చేసుకున్నారు. స్థానిక తేరు మైదానంలో ఏర్పాటుచేసిన టపాసుల దుకాణాల్లో కొనుగోలుదారుల కనిపించింది. మార్కెట్‌లో బంతిపూలకు డిమాండ్ ఉండటంతో కొన్నిచోట్ల రెట్టింపు ధరకు విక్రయించారు.