
శాంతియుత సమాజమే లక్ష్యం
గద్వాల క్రైం: శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని.. విధి నిర్వహణలో ఎంతో మంది అమరులవుతున్నారని.. వారి త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో అమరుల స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విపత్తులపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. నవసమాజ స్థాపనలో ముందున్నారన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటూ ఎందరో పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని.. వారి తాగ్యాలు, సేవలు మరవలేనివన్నారు. ఇటీవల నిజామాబాద్‌లో రౌడీ షీటర్ చేతిలో కానిస్టేబుల్ హత్యకు గురికావడంపై సంతాపం వ్యక్తంచేశారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన ఓపెన్ హౌస్ స్టాల్స్, రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. పోలీసు సిబ్బంది, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్‌రావు, సీఐలు టంగుటూరి శ్రీను, టాటబాబు, రవిబాబు, రవి, నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.