
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదవాలి
భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గట్టు తహసీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించడంతో పాటు భూ భారతి దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల సక్సేషన్, పెండింగ్ ముటేషన్, మిస్సింగ్ సర్వే నంబర్లు, పీఓపీ, డీఎస్ వంటి దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా ఆలూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. పంచాయతీల కార్యదర్శులు ఇందిరమ్మ ఇళ్ల కమిటీల సమన్వయంతో ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ చెన్నయ్య, తహసీల్దార్ విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
గట్టు: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికా బద్ధంగా చదవాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. మంగళవారం గట్టులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు కంప్యూటర్ ల్యాబ్, వంట గది, విద్యార్థినుల హాజరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థినులకు పాఠాలు బోధించారు. మానవ అభివృద్ధి సూచిక, స్థూల జాతీయోత్పత్తి, రాజ్యాంగం ప్రస్తావన, పరిశ్రమలు, వ్యవసాయం, సేవారంగాలు, ఆదాయం, సమానత్వం వంటి సాంఘిక శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. పలు సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థినులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకుసాగాలని తెలిపారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
● ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ సంతోష్ వైద్యాధికారులను ఆదేశించారు. గట్టు పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి.. ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ట్యూబర్ క్లోసిస్, మధుమేహం, రక్తపోటు స్క్రీనింగ్ వందశాతం పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు.
గట్టు కేజీబీవీలో పాఠాలు బోధించిన కలెక్టర్ సంతోష్