
మీ త్యాగం మరువలేనిది
విద్యార్థులపై
ప్రత్యేక శ్రద్ధ అవసరం
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి విలువైన భూములు, ఇండ్లను త్యాగం చేసిన ర్యాలంపాడు గ్రామస్తుల త్యాగం మరువలేనిదని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం వారు ర్యాలంపాడు పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్ర లే అవుట్, మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పునరావస కేంద్రంలో అన్ని వసతులతో కూడిన వసతులు కల్పించేందకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాలంపాడు గ్రామస్తులందరూ ఇక్కడే ఇళ్లు నిర్మంచుకొని జీవనం కొనసాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధిలో కీలక పాత్ర పోశించిన ర్యాలంపాడు గ్రామస్తుల త్యాగం ఎనలేనిదన్నారు. అతి తక్కువ ధరకే భూములు, ఇండ్లు ఇచ్చారన్నారు. అదే ప్రాంతంలోనే ప్రాజెక్టు రిజర్వాయర్, పంప్‌హౌస్, కాల్వలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది
కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలో లక్షా 80వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పూర్తి బాధ్యతతో అండగా ఉంటుందన్నారు. ర్యాలంపాడులో 4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించడం జరిగిందన్నారు. ఈ జలాలతోనే జిల్లా సస్య శ్యామలం అయ్యిందన్నారు. అన్ని వసతులతో కూడిన పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి గాను పునరావాస సెంటర్‌లో రోడ్లు, మురుగు కాల్వలు, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనం, దేవాలయాలు, చర్చిలు వంటి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బాధితులకు అందాల్సిన ఫిట్టింగ్ చార్జెస్‌ను కూడా త్వరలోనే అందే విధంగా చూస్తామన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా 250 ఇళ్లను ఇక్కడ మంజూరయ్యాయని, లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే, కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మిరాయణ, ఆర్డీఓ అలివేలు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాసులు, నాయకులు రాజశేఖర్, విజయ్ కుమార్, పురుషోత్తంరెడ్డి, దైలన్న, హంపన్న పాల్గొన్నారు.
గద్వాలటౌన్: విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం స్థానిక బుర్దపేట ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల చేత ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. బాగా చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిని, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్‌ను పరిశీలించారు. యూడైస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. పాఠశాలలోని వంటగది, త్రాగునీరు, భోజనం నాణ్యత, స్టోర్ రూంలోని సరుకులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. ఆహార పదార్థాలు, కూరగాయాలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. వంట పాత్రలతోపాటు వంటగది ఎల్లప్పుడు శుభ్రంగా ఉండాలన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్,
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
ర్యాలంపాడు పునరావాస కేంద్రం సందర్శన
వసతుల కల్పన..
సమస్యలు పరిష్కరిస్తామని హామీ