
ప్రజా సమస్యలపై పాలకులను ప్రశ్నించాలి
అలంపూర్: ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకులను ప్రశ్నిద్దామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు. అలంపూర్ మున్సిపాలిటీలోని సమస్యలపై కేవీపీఎస్ అధ్వర్యంలో సోమవారం సర్వే నిర్వహించారు. అక్బర్‌పేట, సంతమార్కెట్, పెద్ద దర్గా కాలనీల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేవీపీఎస్ నాయకులు ఆరా తీశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంత మార్కెట్ పక్కన కందకం పూడ్చాలన్నారు. కందకంలో కంపచెట్లు, మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని, ముళ్లపొదలతో విష సర్పాలు సంచరిస్తున్నాయన్నారు. మున్సిపల్ అధికారులు కందకంలోని నీటిని మోటర్ల ద్వార తొలగించాలన్నారు. మురుగు నిల్వ ఉండకుండా కల్వర్టుల ఎత్తు పెంచాలని, సంత మార్కెట్ కాలనీలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన కూరగాయల షెడ్డు వినియోగంలోకి తేవాలన్నారు. అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. అక్బర్ పేటలో వర్షం నీరు ప్రధాన రోడ్లపైనే నిలుస్తుందని, ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించాలన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 16వ తేదీన మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు వెంకటస్వామి, విశ్వం, నరసింహ్మా, అయ్యప్ప, జయన్న, రఫీ, సుకుమార్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.