
పండ్లతోటల సాగు.. భలే బాగు
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో పండ్ల తోటల సాగు ఏటేటా పెరుగుతోంది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో పాటు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు తోటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఏటా పండ్లతోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు..
అనువైన పరిస్థితులు..
పండ్లతోటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, కూరగాయల సాగుకు ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా బోరుబావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్లతోటలను బోరుబావుల కిందే సాగు చేస్తారు. ఇక వాతావరణ విషయానికొస్తే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలి ఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలా నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
అవగాహన కరువు..
ఆయా సీజన్‌లలో పండ్ల తోటలకు రకరకాల తెగుళ్లు ఆశించి.. దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యానశాఖ తగిన సలహలు, సూచనలు అందించి.. రైతులను అప్రమత్తం చేయాలి. దీంతో పాటు మార్కెటింగ్ మెళకువలు తెలియక చాలా మంది రైతులు మధ్యవర్తులకు పండ్లను విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలాంటి వాటిపై అవగాహన సదస్సులు నిర్వహించి.. రైతులకు మెళకువలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సంవత్సరం రైతుల సంఖ్య సాగు
2020–21 2,594 9,315
2021–22 3,354 11,106
2022–23 3,930 12,337
2023–24 4,390 13,568
2024–25 4,936 14,939
2025–26 5,118 15,332
(ఇప్పటివరకు)
నడిగడ్డలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
తోటల పెంపకానికి ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలం
ఏటా రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి
2020–21 నుంచి పండ్లతోటల సాగు ఇలా (ఎకరాల్లో)..
మారిన ఆలోచనా సరళి..
జిల్లాలో పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలను ఏళ్ల తరబడి సాగుచేస్తూ వస్తున్న రైతుల ఆలోచనా సరళిలో మార్పు వస్తోంది. ప్రధానంగా పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటం.. మూడేళ్ల నుంచి ఐదేళ్ల పాటు మంచి నిర్వహణ పద్ధతులు అవలంబిస్తే దిగుబడి బాగా వచ్చి ఆర్థికంగా లాభపడతామన్న ఆలోచనతో రైతులు పండ్ల తోటలపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి, బత్తాయి, పొప్పాయి, అంజిర, జామ, డ్రాగన్‌ఫ్రూట్ తదితర తోటలు సాగుచేస్తున్నారు. కాగా, పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెరగడానికి మరో కారణం కూడా ఉంది. కేంద్ర ఆధీనంలోని ఎంఐడీహెచ్ పథకంతో పాటు, ఉపాది హమీ పథకం కింద పండ్లతోటల సాగుకు ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఆయా పథకాలతో సన్న, చిన్నకారు రైతులు సైతం పండ్లతోటల సాగుపై మొగ్గుచూపుతున్నారు. 2020–21లో జిల్లావ్యాప్తంగా 9,315 ఎకరాల్లో పండ్ల తోటలు ఉండగా.. ఈఏడాది (2025–26) ఇప్పటివరకు 15,332 ఎకరాలకు పండ్లతోటల సాగు విస్తీర్ణం పెరిగింది.